యూరియాపై వార్ ఎఫెక్ట్.. సగానికి పడిపోయిన ఉత్పత్తి

by velandi.Saikiran |   (  Updated:2026-03-12 21:45:30  IST  )

ఇరాన్‌-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీపై పడింది.

యూరియాపై వార్ ఎఫెక్ట్.. సగానికి పడిపోయిన ఉత్పత్తి
X

యూరియాపై వార్ ఎఫెక్ట్

- గ్యాస్ కొరతతో ఆర్ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తికి ఆటంకం

- ఇదివరకు రోజుకు 3,850 టన్నుల ప్రొడక్షన్

- ప్రస్తుతం సగానికి పడిపోయిన ఉత్పత్తి

దిశ, గోదావరిఖని: ఇరాన్‌-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం పెద్దపెల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్‌సీఎల్) కంపెనీపై పడింది. ఆర్ఎఫ్‌సీఎల్ కంపెనీకి గ్యాస్ సరఫరాలో అంతరాయం కారణంగా యూరియా ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. రోజూ వేల టన్నుల యూరియా తయారయ్యే ఈ పరిశ్రమలో ప్రస్తుతం ఉత్పత్తి దాదాపు సగానికి పడిపోయింది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోవడం కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది.

సరఫరాపైనా ప్రభావం..

సాధారణంగా ఆర్ఎఫ్‌సీఎల్‌లో ప్రతిరోజూ సుమారు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుండగా, గ్యాస్ సరఫరా సమస్యతో యూరియా తయారీకి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఉత్పత్తి దాదాపు 50 శాతం తగ్గిపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రోజుకు సుమారు 15,000 టన్నుల ముడి పదార్థం వినియోగించి యూరియా తయారు చేసే ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ఆగిపోవడం రైతులకు యూరియా సరఫరాపైనా ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి.

గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే..

మరో రెండు నుంచి మూడు రోజులు ఇలాగే గ్యాస్ సమస్య కొనసాగితే యూరియా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కార్మికులు, రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి ఉత్పత్తిని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ నిర్వహణలో లోపాలు, గ్యాస్ సరఫరా అంతరాయం వంటి అంశాలపై వెంటనే అధికారులు చర్యలు తీసుకుని ఉత్పత్తిని పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎరువుల కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

ప్రతినెలా 2 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించాలి

- యూరియాపై కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే ఖరీఫ్ 2026 సీజన్ దృష్ట్యా రాష్ట్రంలో ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఏప్రిల్, మే, జూన్ నెలలకు ప్రతినెలా 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు లేఖ రాశారు. గత రబీ సీజన్‌లో రాష్ట్రానికి సమయానికి యూరియా కేటాయించినందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయగలిగామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి యూరియా ప్రారంభ నిల్వలు 50 వేల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే ఉండవచ్చని తుమ్మల తెలిపారు. తెలంగాణలో మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 70 శాతం పంటలు ఖరీఫ్ సీజన్‌లోనే సాగవుతాయని తెలిపారు. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు ఈ సీజన్‌లో విస్తృతంగా సాగు అవుతాయని, ఈ పంటలకు అధిక మొత్తంలో యూరియా అవసరం ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల రైతులకు సమయానికి ఎరువులు అందుబాటులో ఉండేందుకు ముందుగానే నిల్వలు ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని సూచించారు.

Next Story