మహా శివరాత్రి..వేముల‌వాడ వెళ్లే వారికి అల‌ర్ట్‌..!

by velandi.Saikiran |   (  Updated:2026-02-06 20:30:28  IST  )

మహా శివరాత్రి సందర్బంగా స్వామి వారి ఆలయాన్ని పూల అలంకరణతో అందంగా ముస్తాబు చేసి జాతరను వైభవంగా నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

మహా శివరాత్రి..వేముల‌వాడ వెళ్లే వారికి అల‌ర్ట్‌..!
X

దిశ, వేములవాడ టౌన్: వేములవాడ పట్టణంలో మహా శివరాత్రి జాతర సందర్బంగా భక్తులకు సాఫీగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మహా శివరాత్రి జాతర సందర్బంగా వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం పరిశీలించారు. ముందుగా వీఐపీ దర్శనాల కోసం చేసిన ప్రత్యేక ద్వారం, బారికేడింగ్ ను పరిశీలించి శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఈఈ రాజేష్ కు సూచనలు చేశారు. క్యూ లైన్లు పరిశీలించి, నీటి సదుపాయం ఏర్పాట్లను సందర్శించి ఎక్కువ చోట్ల తాగునీటి పాయింట్లు పెట్టి భక్తులకు అందించాలని సూచించారు. అక్కడి నుంచి నూతన బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో స్వామివారి ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కళ్యాణకట్టను పరిశీలించి.. పలు సూచనలు చేశారు. మొబైల్ టాయిలెట్ల సంఖ్య మరింత పెంచాలని ఆదేశించారు.

జాతర వైభవంగా నిర్వహించాలి

మహా శివరాత్రి సందర్బంగా స్వామి వారి ఆలయాన్ని పూల అలంకరణతో అందంగా ముస్తాబు చేసి జాతరను వైభవంగా నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పార్కింగ్ స్థలం వద్ద కోడెల టికెట్ కౌంటర్, పందిర్లు, శివార్చన స్టేజీ పరిశీలించారు. మహా శివరాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.పరిశీలనలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓ రాధాభాయి, ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.

Next Story