నమ్మి పనిలో చేరితే రోడ్డున పడేస్తున్నరు

by Thanuru Gopichand |

పరిచయాలు పలుకుబడే పెట్టుబడిగా వెలుస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీలు కార్మిక చట్టాలను కాలరాస్తున్నాయి.

నమ్మి పనిలో చేరితే రోడ్డున పడేస్తున్నరు
X

దిశ బ్యూరో, కరీంనగర్ : పరిచయాలు పలుకుబడే పెట్టుబడిగా వెలుస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీలు కార్మిక చట్టాలను కాలరాస్తున్నాయి. అమాయక గ్రామీణ యువత, నిరుద్యోగ మహిళలతో వెట్టిచాకిరీ చేయించుకుని శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయి. పొట్ట కూటికోసం ప్రైవేటు ఏజెన్సీలను నమ్మి పనిలో చేరిన వారికి వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో కుటుంబాలు బజారున పడుతున్నాయి. పనిని నమ్ముకుని పట్టణాలకు వచ్చిన అమాయకుల జీవితాలు ఆగమవుతూ చేసిన జీతం చేతికి అందక ఎవరికి చెప్పాలో అర్థం కాక అప్పుల ఊబీలోకూరుకు పోతున్నాయి. మోసపోయామని తేరుకునే లోపు కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. తాజాగా అక్షర సెక్యూరిటీ ఫెసిలిటి మేనేజ్ మెంటు చేసిన మోసాలను ‘దిశ’ వెలుగులోకి తేవడంతో వారి చేతిలో మోసపోయినా బాధితులు దిశకు తమ గోడు వెల్లబోసుకుంటూ న్యాయం కోసం అధికారులను ఆర్థిస్తున్నారు.

అధికారుల కనుసన్నల్లో అక్షర అక్రమాలు

అధికారుల కనుసన్నల్లో అక్షర సెక్యూరిటీ ఫెసిలిటీ నిర్వాహకుడు శ్రీనివాస రావు అక్రమాలకు పాల్పడుతున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్షర ఏజెన్సీ బాధితులు కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన వారు స్పందించడం లేదని పైగా మేము ఫిర్యాదు ఇచ్చిన వెంటనే అతనికి సమాచారం అందిస్తున్నారని దీంతో ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతది.. ఇక మీకు జీతాలు ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బాధితులను బెదిరింపులకు గురిచేయడం అక్షర సెక్యూరిటీ ఫెసిలిటి మేనేజ్మెంటు అక్రమాల్లో అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలను స్పష్టం చేస్తోంది. కార్మిక చట్టాలు కాలరాస్తున్నా ఏళ్లతరబడి పర్యవేక్షించి చర్యలు తీసుకోకపోవడం కూడా అధికారుల పాత్రపై అనుమానాలను బలపరుస్తుంది.

ఫోన్​చేసిన స్పందిస్తలేరు : పుష్పలత, హుస్నాబాద్

-అక్షర సెక్యూరిటీ పెసిలిటి మేనేజ్మెంటు బాధితురాలు

నాపేరు పుష్పలత. నాది హుస్నాబాద్. నేను అక్షర సెక్యూరిటీ ఫెసిలిటి మేనేజ్మెంటు దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేశాను. నాకు అక్టోబరు నెల జీతం ఇవ్వకుండానే తమ ఏజెన్సీని సదరు ఆస్పత్రి వారితో అగ్రిమెంటు రద్దు చేసుకుని వెళ్లిపోయారు. మమ్మల్ని అర్థాంతరంగా తొలగించడంతో మేము రోడ్డున పడ్డాం.. మాకు అక్టోబరు నెల జీతం ఇప్పటి వరకు చెల్లించలేదు. ఎప్పుడు ఫోన్ చేసిన స్పందించడం లేదు. ఆఫీసుకు వెళ్తే సారు లేరు అని అక్కడి సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. సదరు సంస్థ నిర్వాహకుడికి ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయద్దు నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా ఫోన్ చేస్తే మరో నెల రోజులు ఆలస్యం అవుతుంది అంటు బెదిరిస్తున్నారు. దయచేసి మాకు జీతాలు ఇప్పించి న్యాయం చేయగలరు.

ఫోన్ చేస్తే జీతం ఇవ్వను అంటున్నారు : ప్రియాంక

-అక్షర ఫెసిలిటి బాధితురాలు

నేను అక్షర ఫెసిలిటి మేనేజ్మెంటు ఏజెన్సీ వారి వద్ద గత తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నాను. నాకు అక్టోబరు నెల జీతం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆఫీస్​కు వెళ్తే రావొద్దు అంటున్నారు. ఫోన్ చేస్తే చెయ్యొద్దు అంటున్నారు. మేము జీతం ఎవరిని అడగాలి. మాకు జీతం వస్తేనే పూట గడుస్తది. నేను ఖమ్మం జిల్లా నుంచి వీరిని నమ్ముకుని కరీంనగర్ వచ్చాను. ఇప్పుడు మధ్యంతరంగా మమ్మల్ని రోడ్డున పడేశారు. కనీసం మేము పనిచేసిన జీతం మాకు చెల్లిస్తే మా బతుకు మేము బతుకుతాం.. మాకు అధికారులు న్యాయం చేయాలి. లేదంటే అక్షర సెక్యూరిటీ ఫెసిలిటి మేనేజ్మెంటు కార్యాలయం ఎదుట ఆందోళన చేసి న్యాయం జరిగేవరకు వదిలి పెట్టం.

కాళ్లు మొక్కుతాం అన్న కనికరించడం లేదు : పావని, బాధితురాలు

నేను అక్షర సెక్యూరిటీ ఫెసిలిటి మేనేజ్మెంటు వద్ద పనిచేశాను. నాకు నెలరొజుల జీతం ఇచ్చేందుకు ఇబ్బంది పెడుతున్నారు. మా భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడు. నేను కుటుంబాన్ని పోషించుకునేందుకు పనిచేస్తే నాకు జీతం ఇవ్వను. నాకు ఊరికే ఫోన్ చేయొద్దు అంటూ నిర్వాహకుడు శ్రీనివాస్ రావు బెదిరిస్తున్నారు. నేను కాళ్లు మొక్కుతానని బతిమాలిన కనికరించడం లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి. మా జీతాలు మాకు చెల్లించేలా చూడండి. మేము పనిచేసుకుంటేనే బతికేవాళ్లం. మాకు జీతం ఇవ్వకపోతే మేము ఎలా బతకాలి.

Next Story