- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల గురించి మాట్లాడితే ఊడిన ఉద్యోగం..!
జగిత్యాల జిల్లా కేంద్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సోమవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమం రాజకీయంగా కాకుండా ఇప్పుడు మరో వివాదానికి కేంద్రబిందువైంది.

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సోమవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమం రాజకీయంగా కాకుండా ఇప్పుడు మరో వివాదానికి కేంద్రబిందువైంది. ధర్నా జరుగుతున్న సమయంలో అదే మార్గంలో బస్సు నడుపుతూ వెళ్లిన జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ అశోక్ “ముందు రైతుల వడ్లు, మక్కల గురించి పట్టించుకోండి.. తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల గురించి మాట్లాడండి” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటన తర్వాత ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం నుంచి అశోక్‌కు రిమూవల్ లెటర్ జారీ చేసి డ్యూటీకి రావద్దని సూచించినట్లు సమాచారం. అయితే తాను ఎలాంటి రాజకీయ పార్టీని గానీ, నాయకుడిని గానీ విమర్శించలేదని, కేవలం రైతుల సమస్యలపై స్పందించానని అశోక్ పేర్కొన్నాడు. రైతుల తరఫున మాట్లాడినందుకే తనపై చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
డ్రైవర్ అశోక్ పై చర్యలు తీసుకోవడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. వెంటనే అశోక్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోకపోతే రెండేళ్ల పాటు అతని కుటుంబ పోషణ బాధ్యత పార్టీ తీసుకుంటుందని ప్రకటించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రస్తుతం టెంపరరీ డ్రైవర్‌గా ఉన్న అశోక్‌ను పర్మినెంట్ ఉద్యోగిగా చేస్తామని హామీ ఇచ్చారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందన
ఈ ఘటనపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా స్పందించారు. అశోక్‌కు ఫోన్ చేసి పరామర్శించిన ఆయన రైతు సమస్యలపై మాట్లాడడం తప్పేం కాదన్నారు. రైతుల కోసం మాట్లాడిన వ్యక్తికి అన్యాయం జరగకూడదని పేర్కొంటూ బీజేపీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
బీజేపీ నేత బోగ శ్రావణి పరామర్శ
జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి అశోక్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. రైతుల తరఫున మాట్లాడిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొంటూ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన
ఈ ఘటనపై ట్రాన్స్‌పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ అశోక్ ఆర్టీసీ శాశ్వత ఉద్యోగి కాదని, కేవలం హైర్ బస్సు డ్రైవర్ మాత్రమేనని వివరణ ఇచ్చారు. రైతు సమస్యలపై అతను మాట్లాడిన విషయాన్ని ప్రభుత్వం స్వాగతిస్తోందని తెలిపారు. అశోక్‌ను తొలగించవద్దని సంబంధిత బస్సు యజమాన్యానికి సూచించినట్లు చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయంగా మలచవద్దని ప్రతిపక్షాలకు సూచించారు.






