రాముని మీద రాజకీయం చేస్తే ఓట్లు రావు : మానకొండూరు ఎమ్మెల్యే

by Disha Web Desk 23 |
రాముని మీద రాజకీయం చేస్తే ఓట్లు రావు : మానకొండూరు ఎమ్మెల్యే
X

దిశ, జమ్మికుంట: రాముని మీద రాజకీయం చేస్తే ఓట్లు రావని, ఓట్ల కోసం దేవుని అక్షింతలు ఇంటింటికి పంపించారని, వారి మీద వారికి నమ్మకం లేకనే దేవుళ్లను వాడుకుంటున్నారని బీజేపీ పార్టీని ఉద్దేశిస్తూ డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం జరగనున్న జన జాతర సభ ప్రాంగణాన్ని, హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న హయాంలో రూ.20 వేల కోట్ల రూపాయలను కొట్టేసాడని, తాళిబొట్టు అమ్ముకున్న అనే వ్యక్తి కి ఆలి విలువ ఏం తెలుస్తుందని బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ఘాటుగా విమర్శలు చేశారు. సీబీఐ, ఈడి, ఇటీ దర్యాప్తు సంస్థలను దగ్గర పెట్టుకుని ఇతర పార్టీల నాయకులను బెదిరింపులకు పాల్పడుతూ ఆటాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రో బాండ్లను విడుదల చేయటం లేదని, అర్హులు కానీ వ్యక్తులు కూడా ఎన్నికల బాండులను కొన్నారని, దేశంలో దాదాపు 20 కంపెనీలు ఉన్నాయని, బీజేపీ అవినీతికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ మాట్లాడే తీరును చూస్తుంటే దయ్యాలు వేదాలు వర్ధించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.

బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కి చదువు లేదని, పొద్దున లేస్తే దేవుడి పేరు తప్ప ఏమీ చేయడని పేర్కొన్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఒక నియంతను బొంద పెట్టారని, రానున్న ఎన్నికలలో కేంద్రంలో కూడా ఇలాగే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు స్థానికుడని, అసెంబ్లీ స్థానాల పునర్వివిభజన కంటే ముందు 2004 లో చొప్పదండి నియోజకవర్గం నుండి కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ పోటీలో నిలిచారని, అదే విధంగా 2009 లో కరీంనగర్ నుండి పోటీ చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ వలసవాది అని, హనుమకొండ నుండి వలస వచ్చాడని, కరీంనగర్ లో పుట్టి పెరిగిన వ్యక్తి వెలిచాల రాజేందర్ రావు అని వివరించారు. విలేకరుల సమావేశంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకుడు సాయిని రవి, నాయకులు మొలుగూరి సదయ్య, దేశిని కోటి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed