- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ్లు కొనమని అడిగితే కేసులు పెట్టిస్తారా..? ఖబడ్దార్ మేడిపల్లి సత్యం : సుంకే రవిశంకర్
తమ కష్టార్జితమైన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించినందుకు అన్నదాతలపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, గంగాధర : తమ కష్టార్జితమైన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించినందుకు అన్నదాతలపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఎస్సై వంశీకృష్ణతో మాట్లాడిన ఆయన, వడ్లు కొనమని అడిగిన నారాయణపూర్ గ్రామానికి చెందిన 8 మంది రైతులను నేరస్థులుగా చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "రైతుల మీద కోపం వద్దు.. బీఆర్‌ఎస్ నాయకులపై ఉన్న కోపంతో అమాయక రైతులను బలి చేయొద్దు. దమ్ముంటే నారాయణపూర్ రైతులను కాదు.. వారికి బదులు నన్ను రిమాండ్ చేయండి" అంటూ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులపై నమోదైన కేసుల విషయంలో సుంకే రవిశంకర్ తీవ్రంగా స్పందించారు.
ఎస్సై సమక్షంలోనే ఆయన కరీంనగర్ పోలీస్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై నిలదీసినంత మాత్రాన రైతులపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీపీ.. కేసుల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని, రిమాండ్ వరకు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సుంకే రవిశంకర్ వెల్లడించారు. కలెక్టర్, సీపీ, ఎమ్మెల్యే సమక్షంలోనే రైతులు తమ ధాన్యం కొనుగోలు ఎప్పుడు జరుగుతుందని నిలదీశారని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. అలా అడిగినందుకే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. వడ్ల కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని, ఇలాంటి సమయంలో సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అన్నదాతలను వేధించడం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తుందని హెచ్చరించారు.
చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, రైతులు ఇచ్చిన ఫిర్యాదులపైనా పోలీసులు సమానంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "వడ్లు కొనమని అడిగితే కేసులు పెడతారా? కబర్దార్ మేడిపల్లి సత్యం.. ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలు ఆపాలి" అని సుంకే రవిశంకర్ హెచ్చరించారు. రైతులపై నమోదైన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని, లేనిపక్షంలో రైతాంగాన్ని ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి వంటి ఉధృత కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, నారాయణపూర్ గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






