అంటరానితనం పాటిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు : తహశీల్దార్ అంబటి రజిత

by Ratna Kumari |

మండలంలోని నారాయణపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.

అంటరానితనం పాటిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు :  తహశీల్దార్ అంబటి రజిత
X

దిశ, గంగాధర : మండలంలోని నారాయణపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దీకొండ బాబలక్ష్మి మధు అధ్యక్షతన నిర్వ‌హించిన‌ తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీడీఓ దమ్మని రాము, ఎస్ఐ వంశీ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తహశీల్దార్ అంబటి రజిత మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 17 ప్రకారం.. అంటరానితనం అనేది పూర్తిగా నిషేధించబడిందని, సమాజంలో పౌరులందరూ సమానమేనని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో మెలిగి రాజ్యాంగ బద్ధమైన హక్కులను గౌరవించాలని సూచించారు.

ముఖ్యంగా గ్రామాల్లో, హోటళ్లలో రెండు గ్లాసుల విధానం పాటించడం, ఆలయ ప్రవేశంలో వివక్ష చూపడం వంటివి నేరాలని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట పరంగా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. పౌరులందరూ చట్టాలపై అవగాహన పెంచుకొని బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరారు. ఎంపీడీఓ రాము, ఎస్ఐ వంశీ కృష్ణ మాట్లాడుతూ.. పౌర హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ఐకేపీ, ఉపాధి హామీ ప్రాజెక్ట్ అధికారి, పోలీస్ సిబ్బంది, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది, అంగన్ వాడీ కార్యకర్తలు, పంచాయతీ సెక్రెటరీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Next Story