- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్ మున్సిపాలిటీకి రూ. 4 కోట్ల అభివృద్ధి కళ!
హుజురాబాద్ పట్టణాభివృద్ధే ధ్యేయంగా మున్సిపల్ పాలకవర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణాభివృద్ధే ధ్యేయంగా మున్సిపల్ పాలకవర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసినీ అధ్యక్షతన నిర్వహించిన పురపాలక సంఘ సర్వ సభ్య సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణ ప్రగతి కోసం కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టిన మొత్తం 41 అంశాలకు పాలకవర్గ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
రూ. 4 కోట్లతో పట్టణ రూపురేఖలు..
హుజురాబాద్ పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా రూ. 4 కోట్ల నిధుల మంజూరుకై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత మున్సిపల్ కార్యాలయ భవనంపై అత్యాధునిక వసతులతో నూతన కౌన్సిల్ హాలు నిర్మాణానికి రూ. 1,50,00,000/- (కోటిన్నర) ప్రతిపాదించారు. పట్టణంలోని మొత్తం 30 వార్డుల్లో వివిధ రకాల అభివృద్ధి పనుల కొరకు రూ. 2,50,00,000/- (రెండున్నర కోట్లు) కేటాయించాలని తీర్మానించారు.
ప్రజోపయోగ పనులకు తక్షణ నిధులు..
పట్టణ ప్రజల తక్షణ సమస్యల పరిష్కారానికి కౌన్సిల్ నిధులు మంజూరు చేసింది. వీధి దీపాల రిపేర్లకు రూ. 5 లక్షలు,పట్టణంలోని ప్రధాన రహదారుల మధ్య గల సెంట్రల్ మీడియన్లలో వెలగని విద్యుత్ దీపాలకు మున్సిపల్ సాధారణ నిధుల నుండి రూ. 5 లక్షలతో మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు. తాగునీటి లీకేజీల అరికట్టడానికి రూ. 5 లక్షలు, వేసవి నేపథ్యంలో పట్టణంలో తాగునీటి ఎద్దడి రాకుండా చూసేందుకు జోన్-I, జోన్-II ట్రంక్ మెయిన్ పైపుల లీకేజీలను అరికట్టడానికి 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి రూ. 5 లక్షలు కేటాయించి ఎయిర్ వాల్స్ బిగించనున్నారు.
బక్రీద్ ఏర్పాట్లు.. దోమల నివారణకు చర్యలు..
రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం సాధారణ నిధుల నుండి రూ. 2 లక్షలతో తగిన ఏర్పాట్లు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో పట్టణంలో దోమల నివారణకై రూ. 1,49,000 లతో కొత్తగా రెండు ఫాగింగ్ మెషిన్లను కొనుగోలు చేయుటకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో వైస్-చైర్‌పర్సన్ గూడూరి అంజలి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులతో పాటు మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ డి. కిరణ్, టెక్నికల్ అధికారి నరేష్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ అశ్వినీ గాంధీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఐ. రమేష్, జూనియర్ అకౌంటెంట్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, వ్యవస్థాపన విభాగాధికారి పి. శంకర్ బాబు పాల్గొన్నారు.






