- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా తగ్గిన మామిడి దిగుబడి..రైతు కుదేలు
జగిత్యాల మామిడి దిగుబడి భారీగా తగ్గుదల! 35 వేల ఎకరాల్లో పంట దెబ్బతినడంతో రైతుల ఆందోళన. దళారుల సిండికేట్‌ను అడ్డుకోవాలని డిమాండ్.

దిశ, జగిత్యాల ప్రతినిధి : ప్రపంచ మార్కెట్లో జగిత్యాల మామిడి కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి ఏటా సమ్మర్ లో జగిత్యాల మ్యాంగో మార్కెట్ నుంచి దేశంలోని పలు నగరాలకు మామిడి ఎగుమతి అవుతుంది. అక్కడి నుంచి ప్రత్యేకంగా ప్యాక్ చేసి దేశ విదేశాలకు ‘జగిత్యాల బ్రాండ్’ పేరుతో ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మామిడి పంట దిగుబడి గణనీయంగా పడిపోయిందని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన డిమాండ్ ఉన్న అందుకు సరిపోను దిగుబడి లేక ఇటు రైతులతో పాటు గుత్తేదారులు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 35 వేల ఎకరాల్లో సాగు
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 35 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల రూరల్, రాయికల్, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, సారంగాపూర్ మండలాల్లో మామిడి ఎక్కువగా సాగు అవుతుంది. మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉన్న జగిత్యాల మామిడి రకానికి ఈ దఫా దిగుబడి ఆశించిన స్థాయిలో లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎకరాకు రకాన్ని బట్టి రెండు నుంచి నాలుగు టన్నుల దిగుబడి వస్తే ఈసారి టన్ను దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని మామిడి రైతులు చెబుతున్నారు.
నష్టపోతున్న రైతులు, గుత్తేదారులు
కొందరు మామిడి రైతులు నేరుగా తమ పంటను మ్యాంగో మార్కెట్లో విక్రయిస్తే మరికొందరు రైతులు ప్రతి ఏటా మామిడి పంటను గుత్తేదారులకు ఇస్తున్నారు.ఈ క్రమంలో ఈ ఏడాది పంట దిగుబడి తగ్గడంతో రైతులతో పాటు గుత్తేదారులు సైతం నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. దిగుబడి వచ్చిన అరకొర పంటకు కూడా తేనె మంచు, నల్ల తామర వంటి వ్యాధులతో మామిడికి మార్కెటింగ్ సమస్యలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే రైతులు తీసుకువచ్చిన మామిడికాయలను అమ్ముకునేందుకు ఓపెన్ మార్కెట్ సౌకర్యం లేకపోవడం మామిడి రైతులకు మరింత నష్టాన్ని చేకూర్చుతుంది. గతంలో 40 వేల ఎకరాల పైబడి విస్తీర్ణంలో మామిడి పండిస్తే ప్రస్తుతం అది 35 వేల ఎకరాలకు పడిపోయిందంటే మామిడి రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దళారుల చేతుల్లోకి మామిడి..
జగిత్యాల జిల్లాలో మామిడి రైతులు దిగుబడి రాక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక మార్కెట్‌లో ధర ఉన్నా మధ్యవర్తుల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. దళారులు సిండికేట్ గా ఏర్పడి రేట్ డిసైడ్ చేస్తారని దీంతో తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. గతేడాది దిగుబడి ఉన్న దళారులు నిర్ణయించిన ప్రకారమే పంట అమ్ముకోవాల్సి వచ్చిందని ఈ ఏడాది ఇదివరకే దిగుబడి తగ్గి నష్టాల్లో ఉన్న మామిడి రైతులకు దళారులు సిండికేట్ వ్యవస్థ లేకుండా ఓపెన్ మార్కెట్ విధానం ద్వారా అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఈ సారి పెట్టిన పెట్టుబడి కూడా రాదు.
పూత బాగుండి వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎకరానికి రెండు నుంచి నాలుగు టన్నుల దిగుబడి వచ్చేది. ఈ సంవత్సరం మొదట్లో పూత బాగా వచ్చినప్పటికీ కాత సమయం వచ్చే సరికి పూత రాలి దిగుబడి లేకుండా పోయింది. ఎకరాకు క్వింటాల్ దిగుబడి కూడా వచ్చే సూచనలు కనబడలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి లో సగం కూడా వచ్చేలా కనిపించడం లేదు.- నెల్లి మహిపాల్, మామిడి రైతు నందగిరి గ్రామం






