ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిగా ప‌ని చేస్తా : మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్

by Ratna Kumari |   (  Updated:2026-04-06 09:59:17  IST  )

తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిగా ప‌ని చేస్తాన‌ని తెలిపారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరిల‌క్ష్మ‌ణ్ కుమార్.

ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిగా ప‌ని చేస్తా : మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్
X

దిశ‌, వెల్గ‌టూర్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిగా ప‌ని చేస్తాన‌ని తెలిపారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరిల‌క్ష్మ‌ణ్ కుమార్. జ‌గిత్యాల జిల్లా వెల్గటూర్ మండ‌ల కేంద్రంలో సోమ‌వాడం ఎండ‌ప‌ల్లి, వెల్గ‌టూర్ మండ‌లాల‌కు చెందిన ప‌లువురు ల‌బ్ధిదారుల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, సీఎం స‌హాయ‌నిధి చెక్కుల‌ను ఆయ‌న పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌ల్లె ప‌ల్లెకు వెళ్లి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని తెలిపారు. ప్ర‌త్యేకంగా తాగునీటి కొర‌త లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు మంత్రి అడ్లూరి.

రాష్ట్రంలో నడుస్తున్న ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటిల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత పార్టీలకతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పల్లెపల్లెకు వచ్చి ప్రజల సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తొలుత ఎండపల్లి పైలట్ ప్రాజెక్ట్ కింద మంగళవారం ఎండపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామ పంచాయతీ వద్ద సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. అన్ని శాఖల అధికారులు గ్రామంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న వారికి ఎటువంటి ఆంక్షలు లేకుండా బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. అలాగే రాబోయే రెండు నెలలు మండే ఎండల వల్ల గ్రామాల్లో ఏర్పడే మంచి నీటి కొరత పై అధికారులు ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలన్నారు.


మంచినీటి కొరత తీర్చడానికి నిధుల కొరతలేదని.. బోర్ వెల్స్, పైప్ లైన్లు, కరెంట్ మోటర్లు ఏర్పాటు చేసి మంచి నీటి కొరత రాకుండా చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ధర్మపురి నియోజకవర్గానికి మంచినీరు కొరత నివారణకు సరిపడే నిధులను రాబట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మరో 1000 ఇందిరమ్మ ఇండ్లు నియోజక వర్గానికి వస్తున్నాయి.అర్హులైన వారిని గుర్తించే వాటిని అందించే ప్రయత్నం చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అంతకు ముందు వెల్గటూర్ మండలానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, వివిధ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న 78 మంది లబ్ధిదారులకు రూ. 25.40 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ అందజేశారు. అలాగే ముగ్గురు దివ్యాంగులకు మంత్రి స్కూటీలను అందజేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో కూర్చొని చాలా సేపు సామాన్య ప్రజల సమస్యలను ఓపిగ్గా వింటూ అక్కడి నుంచే అధికారుల తో మాట్లాడి పరిష్కారం కోసం మంత్రి కృషి చేయటం విశేషం.

Next Story