- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్ మున్సిపాలిటీ పై ‘హస్తం’ జెండా
హుజురాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను దక్కించుకున్నారు. మొత్తం 30 వార్డులున్న హుజురాబాద్ మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మెజారిటీ కౌన్సిలర్ల మద్దతుతో పాటు స్వతంత్ర అభ్యర్థి కూడా మద్దతు ప్రకటించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గా రొంటాల సుహాసిని (30వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్), వైస్ చైర్‌పర్సన్ గా గూడూరి అంజలి (8వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్) లు ఎన్నికయ్యారు. రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ ఎన్నిక అత్యంత ప్రాధాన్యత సంతరించు కుంది. దీంతో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన ఓటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అధికారులు పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
సంబరాల్లో కార్యకర్తలు..
కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖరారు కావడంతో మున్సిపల్ కార్యాలయం వెలుపల పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. "ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ హుజురాబాద్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం" అని కొత్తగా ఎన్నికైన చైర్‌పర్సన్ సుహాసిని, వైస్ చైర్ పర్సన్ అంజలి, కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈ విజయం పార్టీ కార్యకర్తల కష్టానికి, నాయకత్వానికి దక్కిన విజయమని స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేశారు.






