- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టులో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

దిశ, కొండగట్టు : జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం భక్తిరసంతో నిండిపోయింది. మంగళ వాయిద్యాలు, వేదఘోషల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి పవిత్ర శేష వస్త్రాలను దేవస్థానం ఈవో దామోదర్ ప్రత్యేకంగా తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శేష వస్త్రాలను స్వీకరించి ' వై ' జంక్షన్ నుంచి ఎదుర్కొని ఆలయానికి తీసుకురాగా.. ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ఈవో ఎస్. అంజన రెడ్డి, స్థానాచార్యులు కపిందర్ స్వామి, ఆలయ అర్చకులకు శేష వస్త్రాలను అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. భద్రాచల దేవస్థానం ఈవో దామోదర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి వేదోక్త ఆశీర్వచనాలు అందించి శేష వస్త్రంతో సత్కరించి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. జయంతి ఉత్సవాల సందర్భంగా స్వస్తి వాచనం, రక్షాబంధనం, ఋత్విక్ వరణం, అరుణి మథనం, దేవతాహ్వానం, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, హవనాలు తదితర వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అలాగే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, సహస్రనామార్చనలు, పారాయణాలు, నైవేద్యాలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సునీల్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చెక్కిళ్ళ అశోక్, ఆలయ అర్చకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






