- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నదాతలకు గుబులు పుట్టిస్తున్న మొగులు.. అధికారులకు వేడుకోలు
ఎండనక, వాననక, రాత్రనక, పగలనక ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు లేక రోడ్లపై ధాన్యం పోసి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు.

దిశ, సైదాపూర్ : ఎండనక, వాననక, రాత్రనక, పగలనక ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు లేక రోడ్లపై ధాన్యం పోసి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ వరి కోతలు ప్రారంభమై ధాన్యం విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పంటలను కోసి ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అంతేకాకుండా అన్నదాతల గుండెల్లో మొగులు గుబులు పుట్టిస్తుంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక అయోమయ స్థితిలో రైతులు ఉన్నారు. వరుణుడు ఆగ్రహిస్తే చేతికి అందిన వంట నేలపాలవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల క్రితం వరికోత కోసి దాన్ని ఆరబెట్టి అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల జాడలేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. సైదాపూర్ మండలంలో ఖరీఫ్ సీజన్లో 15వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 36.00 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. మండలంలో ఐకేపీ ద్వారా 11 కొనుగోలు కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా 4 కొనుగోలు కేంద్రాలు, విశాల పరపతి సహకార సంఘం ద్వారా 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభిస్తే అన్నదాతలకు ఇబ్బందులు తగ్గుతాయని కోరుతున్నారు.
పంట నష్టపోకుండా చూడాలి
కష్టపడి పండించిన ధాన్యం డబ్బులు చేతికి వచ్చేవరకు ఆందోళన గానే ఉంది. వర్షాలు పడితే ధాన్యం తడిసి ముద్దయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. కావున వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. -గుర్రాల మహేందర్ రెడ్డి రైతు, లస్మన్నపల్లి
మొగులు గుబులు పుట్టిస్తుంది
వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని మొగులు గుబులు పుట్టిస్తుంది. వర్షం పడిధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. -గడ్డం ఎల్లమ్మ, రైతు, సోమారం
త్వరలోనే ప్రారంభిస్తాం
త్వరలోనే మహిళా సంఘాల ధారా 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. -ఏపీఎం, చెన్నవేని తిరుపతి






