దర్జాగా కబ్జా.. ప్రభుత్వ భూమిపై బిల్డింగ్, ప్రభుత్వానికే కిరాయికి..!

by Ramesh Naini |

గంగాధర మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దానిపై బహుళ అంతస్తుల భవనం నిర్మించి, ఆ భవనాన్ని తిరిగి గురుకుల పాఠశాల కోసం లీజుకు ఇచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

దర్జాగా కబ్జా.. ప్రభుత్వ భూమిపై బిల్డింగ్, ప్రభుత్వానికే కిరాయికి..!
X

దిశ, గంగాధర : గంగాధర మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దానిపై బహుళ అంతస్తుల భవనం నిర్మించి, ఆ భవనాన్ని తిరిగి గురుకుల పాఠశాల కోసం లీజుకు ఇచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అదే భవనాన్ని ప్రభుత్వానికే లీజు ఇచ్చే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే గంగాధర మండల పరిధిలో ఒకరు తమ సొంత భూమి సర్వే నెంబర్ 804 లో భవనం నిర్మాణం ప్రారంభించి, దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 805 లో కొంత భాగం కూడా కలుపుకుని బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.

సర్వే నెంబర్ 805 లో గల భూమి ప్రభుత్వ ఆస్తిగా ఉందని రికార్డులు చెబుతున్నాయి.అయితే గత కొన్నేళ్లుగా ఆ భూమిపై ఒక వ్యక్తి అనధికారంగా భవనం నిర్మించి, ఆ భవనాన్ని గురుకుల పాఠశాల, హాస్టళ్లకు లీజుకు ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం లీజుకు తీసుకున్న భవనం ఏ సర్వే నెంబర్ లో ఉందో, ఆ భూమి యాజమాన్యం ఎవరిదో అధికారికంగా పరిశీలించకుండానే లీజు చెల్లింపులు జరగడం ప్రజల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై తహసీల్దార్ కార్యాలయానికి ఒక్కరు ఫిర్యాదు చేశారు. ‘ప్రభుత్వ భూమి పైన కట్టిన భవనాన్ని తిరిగి ప్రభుత్వ శాఖకు లీజు ఇవ్వడం దందా కాకపోతే ఏమిటి?’ అంటూ ప్రజలు మండిపడుతున్నారు.

ఫిర్యాదు అందింది నిజమే.. తహసీల్దార్​

ఈ అంశంపై తహసీల్దార్ అంబటి రజితను వివరణ కోరగా ఆమె స్పందిస్తూ “ఫిర్యాదు అందింది నిజమేనని, సంబంధిత సర్వే నంబర్ రికార్డులను సేకరించి పరిశీలిస్తున్నాం. మండల సర్వేయర్ తో సర్వే చేయించడం జరిగిందని, సర్వేయర్ సర్వే చేయగా సుమారుగా 5 గుంటల వరకు ప్రభుత్వ భూమి వచ్చిందని, కానీ గతంలో వారు బిల్డింగ్ కట్టే టైమ్‌లో డీఐ తో సర్వే చేయించి.. సర్వే రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం జరిగిందన్నారు. దానివల్ల మా సర్వే ఇచ్చిన రిపోర్టులో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయేమోనన్న కారణంగా మళ్లీ ఏడీకి లెటర్ పెడుతున్నామని తహసీల్దార్ అంబటి రజిత తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు సరైన దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story