హుజురాబాద్‌లో నిధుల రాజకీయం..

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-25 10:57:46  IST  )

హుజురాబాద్‌లో నిధుల రాజకీయం..

-పోటాపోటీ పాలాభిషేకాలు..

- మున్సిపాలిటీలకు నిధులు ఎవరి వల్ల వచ్చాయనే దానిపై హోరాహోరీ పోరు...

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజూరాబాద్,జమ్మికుంట మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన నిధులు ఇప్పుడు నియోజకవర్గంలో రాజకీయ రగడకు కారణమయ్యాయి. ఈ నిధులు తమ నాయకుల కృషి వల్లనే వచ్చాయని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా పాలాభిషేకాలు నిర్వహించడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల అభివృద్ధికి ఒక్కొక్క మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు చొప్పున మొత్తం రూ. 30 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గత రెండు సంవత్సరాలుగా నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయిన తరుణంలో ఈ మంజూరు ప్రజలను సంతోషపరిచింది. అయితే, ఈ సంతోషం ప్రజల్లో ఉండగానే, ఈ నిధులు ఎవరి కృషి వల్ల వచ్చాయనే దానిపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, తాను అసెంబ్లీలోనూ, బయటా ప్రభుత్వాన్ని నిలదీయడం వల్లే ఈ నిధులు మంజూరయ్యాయని సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. దీనికి కౌంటర్‌గా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ప్రణవ్ బాబు కృషి వల్లే ఈ నిధులు వచ్చాయని చెబుతూ ఆయన ప్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఇందుకు దీటుగా బిఆర్ఎస్ కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్లెక్సీకి పాలాభిషేకం చేసి నిధులు తమ నాయకుడి కృషి వల్లనే వచ్చాయని నిరూపించే ప్రయత్నం చేశారు.

రాజకీయ వ్యూహాలు...

గత కొంతకాలంగా కౌశిక్ రెడ్డి, ప్రణవ్ బాబు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే, ఈసారి ఈ వివాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా రోడ్లపైకి చేరి పాలాభిషేకాలతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ నాయకులను పొగడ్తలతో ముంచెత్తుతున్న ఈ పార్టీల తీరుపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు నిధులు మంజూరవ్వడం అభివృద్ధికి దోహదపడుతుందన్నది ప్రజల ఆశ. అయితే, ఈ అభివృద్ధిని ఎవరు సాధించారనే క్రెడిట్ కోసం సాగుతున్న ఈ రాజకీయ పోరు భవిష్యత్తులో కూడా కొనసాగుతుందనేది స్పష్టం. ఈ పరిణామాలు రాజకీయ కోణంలో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ నిధుల కేటాయింపు తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయా లేదా అనేది చూడాలి.

Next Story