ఫోర్‌లైన్ రోడ్డు పనుల్లో లోపాలు..నిత్యం ప్రమాదాల ముప్పు

by velandi.Saikiran |

భీమదేవరపల్లి మండలంలో చేపట్టిన ఫోర్‌లైన్ రోడ్డు పనులు అసంపూర్తిగా మారడం వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తోంది.

ఫోర్‌లైన్ రోడ్డు పనుల్లో లోపాలు..నిత్యం ప్రమాదాల ముప్పు
X

భీమదేవరపల్లి మండలంలో చేపట్టిన ఫోర్‌లైన్ రోడ్డు పనులు అసంపూర్తిగా మారడం వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తోంది. కొత్తపల్లి సాయినగర్ వద్ద వంద అడుగుల వెడల్పు ఉన్న రహదారిని ముల్కనూరుకు వచ్చేసరికి తగ్గించడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో సరైన లైటింగ్ సౌకర్యం లేకపోవడం, అడ్డగోలు పార్కింగ్‌తో ట్రాఫిక్ సమస్యలు జటిలమవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచి ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

దిశ, భీమదేవరపల్లి : ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఫోర్‌లైన్ రోడ్ పనులు సక్రమంగా పూర్తికాకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాల లోపాలు, వెడల్పు తగ్గింపు, ట్రాఫిక్ వ్యవస్థ రోజురోజుకు అస్తవ్యస్తంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తపల్లి సాయినగర్ వద్ద రోడ్డు వెడల్పు సుమారు 100 అడుగులుగా ఉండగా, ముల్కనూరు ప్రాంతానికి వచ్చేసరికి అది 90అడుగుల లోపే ఉండడంతో వాహన రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇక్కడ నిత్యం చిన్నా, పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

అసంపూర్ణంగా లైటింగ్ సిస్టమ్

సీసీ రోడ్డు నిర్మాణం, లైటింగ్ సిస్టమ్ పనులు ఆలస్యంగా సాగడం మరో ప్రధాన సమస్యగా మారింది. కొత్తపల్లి సాయినగర్ వరకు లైటింగ్ ఏర్పాట్లు పూర్తయినప్పటికీ, ముల్కనూరు బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద పనులు ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయి. రాత్రివేళల్లో సరైన వెలుతురు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక రహదారి మధ్య భాగంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం, తెలంగాణ స్తూపం వంటి అడ్డంకులను తొలగించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.

అడ్డగోలుగా వాహనాల పార్కింగ్...

రోడ్డు పక్కన ఉన్న వైన్ షాపులు, హోటళ్ల వద్ద వాహనాలు అడ్డగోలుగా నిలపడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైనే నిలుస్తోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి లైటింగ్ సిస్టమ్, సీసీ పనులు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story