- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలాపూర్ గ్రామ రైతులు ఇతర గ్రామాలకు ఆదర్శం : మంత్రి అడ్లూరి
రైతులు సమిష్టి కృషితో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

దిశ, గొల్లపల్లి : రైతులు సమిష్టి కృషితో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల సౌకర్యార్థం మంత్రి మంజూరు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, బోరుబావిని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ రైతులు ఐక్యమత్యంతో సొసైటీని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం సమిష్టిగా నిధులు సేకరించి 4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయడం గొప్ప విషయమన్నారు. తిరుమలాపూర్ రైతుల సమిష్టి కృషి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి కొనియాడారు. అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలు, మిగతా సమయంలో పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి అని గ్రామస్తులకు సూచించారు.
ఆందోళన వద్దు..ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
వరి, మొక్కజొన్న పండించిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా ఇచ్చారు. పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటికే 2.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మిగిలిన ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్, సొసైటీ చైర్మన్ గాజే హన్మాండ్లు, సర్పంచ్ కాషా అంజలి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాపల్లె గంగన్న, ప్రధాన కార్యదర్శి జెల్ల అనిల్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.






