తాళికట్టు శుభవేళ.. ఎదురుగా ప్రియురాలి రాక..! పీటలపైనే ఆగిన పెళ్లి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-10 09:00:26  IST  )

ప్రేమించి వదిలేస్తానంటే చూస్తూ ఊరుకునే కాలం కాదిది. తనను మోసం చేసి మరో పెళ్లికి సిద్ధమైన ప్రియుడి మెడలు వంచిందో యువతి.

తాళికట్టు శుభవేళ.. ఎదురుగా ప్రియురాలి రాక..! పీటలపైనే ఆగిన పెళ్లి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించి వదిలేస్తానంటే చూస్తూ ఊరుకునే కాలం కాదిది. తనను మోసం చేసి మరో పెళ్లికి సిద్ధమైన ప్రియుడి మెడలు వంచిందో యువతి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో శనివారం జరగాల్సిన ఓ వివాహం, పాత ప్రియురాలి ఎంట్రీతో అర్ధాంతరంగా ఆగిపోయింది. పదేళ్ల బంధాన్ని, వరుడి మోసాన్ని ఆధారాలతో సహా నిరూపించడంతో పెళ్లికూతురు పీటల మీద నుంచే లేచి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండకు చెందిన ఓ యువతికి, చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన పిడుగు నరేష్‌ అనే యువకుడికి 2015లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. నరేష్ గతంలో చొప్పదండి పోలీస్ స్టేషన్‌లో ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేశాడు. సదరు యువతి హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ నివసిస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నరేష్, ఆమెతో పదేళ్ల పాటు సహజీవనం చేశాడు. అయితే.. ఇప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి తన ఇంట్లో ఒప్పుకోవడం లేదని తప్పించుకోవడం మొదలుపెట్టాడు.

మండపంలోనే గొడవ.. ఆగిన పెళ్లి

తమ ప్రేమ విషయం దాచిపెట్టి, నరేష్ శనివారం చొప్పదండికి చెందిన మరో యువతితో అంగరంగ వైభవంగా పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు.. నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు అంజలి కాదర్, ఇతర మహిళా సంఘాల నేతలతో కలిసి నేరుగా కళ్యాణ మండపానికి చేరుకుంది. తాము పదేళ్లుగా కలిసి ఉన్నామని, నరేష్ తనను ఎలా మోసం చేశాడో ఆధారాలతో సహా అక్కడి వారందరికీ వివరించింది. మండపంలోనే గొడవ జరగడంతో అసలు విషయం తెలుసుకున్న పెళ్లికూతురు, తన తల్లిదండ్రులతో కలిసి ముహూర్తానికి ముందే పీటల మీద నుండి లేచి వెళ్ళిపోయింది.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

సమాచారం అందుకున్న చొప్పదండి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Next Story