పదేళ్ల నిరీక్షణకు తెర.. ఎలిగేడులో పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రులు

by Bhanu |

గత పాలకులు నాశనం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ అదే సమయంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

పదేళ్ల నిరీక్షణకు తెర.. ఎలిగేడులో పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రులు
X

దిశ, ఎలిగేడు : గత పాలకులు నాశనం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ అదే సమయంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుదిల్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ సుధా చైర్మన్ కే నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు లతో కలిసి ఎలిగేడు మండలంలో నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు.

మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..మండల ఏర్పాటుకు కృషి చేసిన నాయకులు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతే ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చిందని అన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్టాల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేసే నాయకుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గా ఉన్నారని మంత్రి అభినందించారు. ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు అకస్మాత్తుగా ప్రజలలోకి వస్తారని, ఓడిపోయిన గెలిచిన తర్వాత కనిపించరని, పెద్దపల్లి ఎమ్మెల్యే మాత్రం ఓడిపోయిన సమయంలో కూడా పూర్తిస్థాయిలో ప్రజలలో ఉన్నారని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ప్రజలలో ఉంటూ పని చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత పాలకులు విచ్ఛిన్నం చేసినప్పటికీ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు. గత పాలకుల సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అదనంగా నూతనంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజా ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. గత పాలకులు తీసుకుని వచ్చిన ధరణి చట్టం వల్ల కేవలం పాలకుల కుటుంబ సభ్యులు మాత్రమే లబ్ది పొందారని, అనేక మంది రైతులకు కన్నీళ్లు మిగిల్చిన ధరణి చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసి భూ సమస్యల పరిష్కారానికి అద్భుతమైన భూ భారతి చట్టం ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి అధికారులు వచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని, ప్రజల నుంచి భూ సమస్యల గురించి దరఖాస్తులు తీసుకొని క్షేత్రస్థాయిలోనే వాటిని పరిష్కరిస్తారని అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు అందుతుందని, రాబోయే 4 సంవత్సరాల కాలంలో సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టాలని ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

మంత్రి దుద్దుల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ..

మండలం ఏర్పాటు చేసిన 24 సంవత్సరాల తర్వాత స్థానిక ఎమ్మెల్యే కృషి ఫలితంగా నేడు పోలీస్ స్టేషన్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు అత్యాధునిక సదుపాయాలతో ఎలిగేడు మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. సామాన్య ప్రజలకు కష్టాలను పరిష్కరించే దిశగా పోలీస్ అధికారులు నేడు విధులు నిర్వహిస్తున్నారని, గ్రామ స్థాయి నుంచి పక్కాగా శాంతి భద్రతలు నిర్వహించేలా పోలీస్ వ్యవస్థ పని చేస్తుందని మంత్రి తెలిపారు. పోలీస్ స్టేషన్ కు చాలా తక్కువ మంది రావాలని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వం ఎక్కడ ఆసుపత్రులను నిర్మించినా కూడా ప్రారంభోత్సవ సమయంలో ప్రాంత ప్రజలకు తక్కువ రోగాలు రావాలని, ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన చికిత్స అందాలని కోకోరుకుంటామన్నారు.

అదే విధంగా పోలీస్ స్టేషన్ కు రావాల్సిన పరిస్థితి ఎవరికి రావద్దని, తమ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలను సొంత చుట్టాలు వస్తే ఏ విధంగా పరిష్కరిస్తామో ఆ విధంగా పోలీస్ సిబ్బంది పరిష్కరించాలని మంత్రి సూచించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలిగేడు మండలానికి అత్యధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. నిరుపేదలను స్పష్టంగా గుర్తించి వారికి సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయాలను వసతులను ప్రజా ప్రభుత్వం మెరుగుపర్చిందని, మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సతీమణి ఇటీవల గోదావరిఖని జనరల్ ఆసుపత్రి లో ప్రసవించిందని ప్రభుత్వ ఆసుపత్రి ను ఉపయోగించే ప్రజలలో భరోసా కల్పించినందుకు మంత్రి జిల్లా కలెక్టర్ ను అభినందించారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ..

ఉమ్మడి రాష్ట్రంలోనే మండల ఆఫీసు, తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ప్రజా పాలనలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలిగేడు మండల ప్రజల కోసం రాబోయే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ మాట్లాడుతూ.. మన కమిషనరేట్ పరిధిలో నాలుగు నూతన పోలీస్ స్టేషన్ లను ఒకే రోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి కృషి ఫలితంగా ఇది సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్, డిసిపి కరుణాకర్, అదనపు కలెక్టర్లు డి.వేణు, జే.అరుణశ్రీ, రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ , ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story