మే 1 నుంచి విద్యుత్ భ‌ద్ర‌త వారోత్స‌వాలు

by Ratna Kumari |

విద్యుత్ వినియోగంలో ప్రజలకు అవగాహన కల్పించి, ప్రమాదాలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో 'విద్యుత్ భద్రత వారోత్సవాలు' నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రకటించారు.

మే 1 నుంచి విద్యుత్ భ‌ద్ర‌త వారోత్స‌వాలు
X

దిశ, హుజురాబాద్ రూరల్ : విద్యుత్ వినియోగంలో ప్రజలకు అవగాహన కల్పించి, ప్రమాదాలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో 'విద్యుత్ భద్రత వారోత్సవాలు' నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రకటించారు. గురువారం కరీంనగర్ సర్కిల్ హుజురాబాద్ మండల పరిధిలోని సింగాపూర్ సబ్ స్టేషన్‌లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా భద్రతా వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు.

​సిబ్బంది భద్రతే ముఖ్యం

ఈ సందర్భంగా సీఎండీ సిబ్బందితో ముఖాముఖిలో మాట్లాడారు. విధి నిర్వహణలో సిబ్బంది తప్పనిసరిగా భద్రతా పరికరాలను ధరించాలని ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు లైన్ల నిర్వహణలో ఏమరపాటుగా ఉండొద్దని సూచించారు. విద్యుత్ రంగంలో నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల ప్రాణనష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం అని,ఇందుకోసం 18 సర్కిళ్లకు నోడల్ అధికారులను నియమించామని, వీరు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు.

వినియోగదారులు, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు

ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాల్లో సరైన ఎర్తింగ్ వ్యవస్థ ఉండాలని, తెగిపడిన విద్యుత్ తీగలను తాకరాదని,వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. తడి చేతులతో స్విచ్‌లు, మోటార్ స్టార్టర్లు ఆపరేట్ చేయడం అత్యంత ప్రమాదకర మన్నారు. నాసి రకం వైర్లు, అతుకులు ఉన్న వైర్లను వాడకూడదని, పాతబడిన మీటర్లు, సర్వీస్ వైర్లను తనిఖీ చేయించుకోవాలని సూచించారు.

ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం

వారోత్సవాల నేపథ్యంలో విద్యుత్ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టిందని, ఇందులో భాగంగా వంగిన స్తంభాలు, వేలాడుతున్న విద్యుత్ తీగలు, పాత వైర్లను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే 24/7 అందుబాటులో ఉండే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎస్ఈఆర్ రవీందర్, డీఈలు లక్ష్మారెడ్డి, చంద్రమౌళి, అనిల్ కుమార్, ఏడీఈలు శ్రీనివాస్, ప్రశాంత్, ఏఈ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story