- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ 'స్పెషల్' దోపిడీ
పండగ పూట సామాన్యుడికి ఊరటనివ్వాల్సింది పోయి, తెలంగాణ ఆర్టీసీ 'స్పెషల్' పేరుతో చుక్కలు చూపిస్తోంది.

దిశ, హుజూరాబాద్ రూరల్ : పండగ పూట సామాన్యుడికి ఊరటనివ్వాల్సింది పోయి, తెలంగాణ ఆర్టీసీ 'స్పెషల్' పేరుతో చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే పెరిగిన ఛార్జీలతో సతమతమవుతున్న ప్రయాణికులపై పండగ రద్దీని ఆసరాగా చేసుకుని అదనపు బాదుడు మొదలుపెట్టింది. హనుమకొండ బస్టాండ్‌లో వెలుగుచూసిన కొన్ని సంఘటనలు ఆర్టీసీ తీరుపై తీవ్ర అసహనాన్ని రేకెత్తిస్తున్నాయి. హనుమకొండ నుంచి హుజూరాబాద్ వెళ్లేందుకు బస్సెక్కిన హుజురాబాద్ కు చెందిన ఓ ప్రయాణికుడికి కండక్టర్ షాక్ ఇచ్చారు. సాధారణంగా రూ. 60 ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ. 80 వసూలు చేశారు. "ఉదయం వచ్చేటప్పుడు రూ. 60 ఇచ్చాను కదా.. ఇప్పుడెందుకు ఎక్కువ?" అని ప్రయాణికుడు ప్రశ్నించగా.. ఇది వరంగల్-1 డిపో బస్సు, ఈరోజు పండగ కాబట్టి స్పెషల్ ధర ఉంటుందని కండక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితుడు హుజురాబాద్ పట్టణానికి చెందిన మల్లేష్ అనే ప్రయాణికుడు 'దిశ' తో తెలిపాడు.
కరీంనగర్ వెళ్లేవారిపై మరింత భారం
హుజూరాబాద్‌కే పరిమితం కాకుండా కరీంనగర్ వెళ్లే ప్రయాణికుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాధారణంగా రూ. 110 ఉండాల్సిన టికెట్ ధరను 'స్పెషల్ పేరు' కింద ఏకంగా రూ. 40 పెంచి రూ. 150 వసూలు చేస్తున్నారు. ఒకే రూట్‌లో నడిచే బస్సుల్లో ఒకదానికి ఒక ధర, ఇంకోదానికి మరో ధర ఉండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పండగ పూట సొంత ఊళ్లకు వెళ్దామనుకుంటే ఆర్టీసీ ఇలా దోచుకోవడం ఏంటి? ఉదయం ఒక ధర, సాయంత్రం ఒక ధర వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నియంత్రణ లేని ధరల పెంపుపై ఉన్నతాధికారులు స్పందించాలని, స్పెషల్ బస్సుల పేరుతో సాగిస్తున్న ఈ దోపిడీని వెంటనే అరికట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.






