చీటింగ్ బాధితులకు 'న్యాయం' చేయండి

by Ratna Kumari |

మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోయిన బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రాధాన్యత కావాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు.

చీటింగ్ బాధితులకు న్యాయం చేయండి
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోయిన బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రాధాన్యత కావాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. బుధవారం హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ వ్యాప్తంగా నమోదైన చీటింగ్, ఫోర్జరీ కేసుల ప్రస్తుత స్థితిగతులపై అధికారులను ఆరా తీశారు.

నేరగాళ్ల గుట్టు రట్టు చేయాలి

​ప్రస్తుత కాలంలో నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను వంచిస్తున్నారని, వారిని పట్టుకోవడంలో సాంకేతికతను ఆయుధంగా మలచుకోవాలని సీపీ సూచించారు. "నేరం జరిగిన తీరును విశ్లేషించి, ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాలను సేకరించాలని, ఏళ్ల తరబడి కేసులను పెండింగ్‌లో ఉంచకుండా, పటిష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ణీత గడువులోగా కోర్టులో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని" అధికారులను ఆదేశించారు. నేరస్తులకు శిక్ష పడే వరకు కేసులను పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు.

​ప్రజల నమ్మకాన్ని కాపాడండి

పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించేలా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలని సీపీ స్పష్టం చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వస్తే సానుకూలంగా స్పందించి, వారి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో రాజీ పడొద్దని హెచ్చరించారు. ఈ సమీక్షలో హుజూరాబాద్ ఏసీపీ వి.మాధవి, ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, శ్రీనివాస్, రామకృష్ణ, ఎస్ఐలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతి, డివిజన్ స్థాయి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story