బడి గంట మోగేలోపే పుస్తకాల పంపిణీ

by Ratna Kumari |

ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే మొదటి రోజునే ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని గంగాధర మండల విద్యాశాఖాధికారి ఏనుగు ప్రభాకర్ రావు తెలిపారు.

బడి గంట మోగేలోపే పుస్తకాల పంపిణీ
X
దిశ, గంగాధర : ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే మొదటి రోజునే ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని గంగాధర మండల విద్యాశాఖాధికారి ఏనుగు ప్రభాకర్ రావు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూడైస్+ వివరాల ప్రకారం పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన విజయవంతంగా ప్రారంభించారు. మండలంలోని ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థుల కోసం విద్యాశాఖ భారీగా సామగ్రిని సిద్ధం చేసి పంపిణీ చేస్తోందని ఎంఈఓ తెలిపారు.
పాఠ్యపుస్తకాలు 25,708, నోట్‌బుక్స్ 24,092, హైస్కూల్ ప్రోగ్రెస్ కార్డులు1,845 ప్రాథమిక పాఠశాల ప్రోగ్రెస్ కార్డులు 911 పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా 100 శాతం పుస్తకాల పంపిణీని పూర్తి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా దూరదృష్టి, అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి డా. అశ్విని తనాజీ వాకడే నిరంతర మార్గనిర్దేశక పర్యవేక్షణలో సజావుగా సాగుతోందని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ఉన్నతాధికారులు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడమే లక్ష్యంగా మే 11 నుండి జూన్ 13 వరకు మండల వ్యాప్తంగా "బడిబాట కార్యక్రమం" నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ ప్రభాకర్ రావు వెల్లడించారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, నాణ్యమైన బోధనపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. విద్యాసంవత్సరం మొదటి రోజు నుంచే బోధన సక్రమంగా సాగేలా విద్యాశాఖ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story