రైతులకు డీలర్లు సరైన సూచనలు ఇవ్వాలి : క‌లెక్ట‌ర్ చిత్రా మిశ్రా

by Ratna Kumari |

విత్తనాలు, ఎరువుల కోసం వచ్చిన రైతుకు ఇన్ పుట్ డీలర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.

రైతులకు డీలర్లు సరైన సూచనలు ఇవ్వాలి : క‌లెక్ట‌ర్ చిత్రా మిశ్రా
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : విత్తనాలు, ఎరువుల కోసం వచ్చిన రైతుకు ఇన్ పుట్ డీలర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇన్ పుట్ డీలర్లకు వ్యవసాయ విస్తరణ సేవల డిప్లమా కోర్సు (DAESI) ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకు సమావేశ మందిరంలో జరిగింది. 40 మంది డీలర్లకు 48 వారాల పాటు ఈ శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో డీలర్లను వివిధ పరిశోధన కేంద్రాలకు, వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజ‌రైన క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రైతులు ఎక్కువగా డీలర్లని నమ్ముతారని, అందువల్ల రైతుల ద్వారా డీలర్లకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వపరమైన అవసరాలు, సూచనలు రైతుల వరకు చేరేందుకు డీలర్లు వారధిలా నిలవాలని అన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు విక్రయించాలని, వాతావరణ అంచనాలను పరిస్థితులను వివరించాలని తెలిపారు.

రైతు వేదికల్లో జరిగే సమావేశాలకు హాజరై ఎరువుల గురించిన అవగాహన కల్పించాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో రైతు ఎంత ముఖ్యమో డీలర్లు అంతే ప్రధానమని అన్నారు. డీలర్లను రైతులు నమ్ముతారని, వారి సలహాలను రైతులు తప్పనిసరిగా పాటిస్తారని తెలిపారు. విడిగా విత్తనాల విక్రయం, గడువు తేదీ ముగిసిన ఎరువులు, విత్తనాలు, నకిలీ పురుగు మందులు విక్రయించరాదని అన్నారు. రైతుకు లాభం చేకూర్చే సూచనలు ఇస్తూ నాణ్యమైన విత్తనాలు విక్రయించాలన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. శిక్షణలో ఉత్తీర్ణత సాధించిన 36 మందికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఆత్మ పిడి చత్రు నాయక్, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరావు, పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్, టీఆర్వీకే కోఆర్డినేటర్ హరికృష్ణ, దేశీ ప్రోగ్రాం ఫెసిలిటేటర్ మమత, రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ ఉషారాణి, ఏఈఓ ప్రణీత, కేవీకే శాస్త్రవేత్తలు విజయ్, మహేష్ పాల్గొన్నారు.

Next Story