వందశాతం సబ్సిడీతో ఇస్తున్న పథకం 'దళిత బంధు': మంత్రి గంగుల కమలాకర్

by Disha Web Desk 1 |
వందశాతం సబ్సిడీతో ఇస్తున్న పథకం దళిత బంధు: మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్ టౌన్: దళితులను సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అమలు చేస్తున్న 'దళితబంధు' పథకం లబ్ధిదారులకు వంద శాతం సబ్సిడీతో ఇస్తున్న ఏకైక పథకం అని బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14, 2021 పైలెట్ ప్రాజెక్టు హుజరాబాద్ లో చేపట్టిన దళితబందు పథకం విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిందన్నారు. ఇప్పటి వరకు దళితులకు వంద శాతం సబ్సిడీ అందించిన దాఖలా గతంలో ఎన్నడు లేదన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కన్న కలలు కేసీఆర్ నిజం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబెడ్కర్ సంతోషం వ్యక్తం చేశారని మంత్రి అన్నారు.

శుక్రవారం ప్రకాష్ అంబేద్కర్ హుజరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు యూనిట్లను పరిశీలించి, లబ్ధిదారులతో యూనిట్ల వివరాలు, ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు 60 నుంచి 80 వేల వరకు ఆదాయం పొందుతున్నామని, తాము ఆర్థికంగా లాభపడ్డామని తెలిపారని అన్నారు. హైదరాబాద్ నియోజకవర్గంలో ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం ద్వారా నిన్నటి వరకు కూలీలు ఉన్న వారు నేడు యజమానులుగా మారడమే కాకుండా గణనీయంగా ఆర్థిక వృద్ధి సాధించారని తెలిపారు.

దళితబంధు ద్వారా హుజురాబాద్ నియోజకవర్గంలో 18,021 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ ను, క్షేత్రస్థాయిలో కష్టపడిన క్లస్టర్, నోడల్ అధికారులందరికి మంత్రి అభినందనలు తెలియజేశారు. దళితబంధు పథకం విశిష్టతను ప్రపంచంలోని ప్రజలందరికీ తెలిసేలా కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్లకు తినిపించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి-హరిశంకర్, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జీవీ. శ్యాంప్రసాద్ లాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, నవీన్ నికోలస్, ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి సురేష్, ఈడీఎస్సీ కార్పొరేషన్ నాగార్జున, క్లస్టర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed