బీజేపీలో కొత్త‌గా చేరిన నేత‌ల‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు

by Ratna Kumari |

రామగుండం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం బీజేపీ అంతర్గత వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి.

బీజేపీలో కొత్త‌గా చేరిన నేత‌ల‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు
X

దిశ, గోదావరిఖని : రామగుండం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం బీజేపీ అంతర్గత వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పార్టీలో చేరిన కొందరు నాయకులపై సోషల్ మీడియా వేదికగా పార్టీ కార్యకర్తలే విమర్శలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది. పార్టీ ఫండ్ ని మార్వాడీలకు వడ్డీలకు ఇచ్చుకుంటున్నారని, ఎన్నికల్లో పోటీ చేసేది పార్టీ ఫండ్ కోసమేనని తీవ్ర విమర్శలు ఫేస్ బుక్, సోషల్ మీడియాలో విమర్శించడం అంతా చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని ఉపయోగించుకుంటున్నారనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన కొందరు నేతలపై కొంతమంది మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు నేరుగా పోస్టులు పెడుతుండగా, మరికొందరు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు.

బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి ఉందా? లేక రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా ఈ ప్రచారం జరుగుతోందా? అనే చర్చ పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సాగుతోంది. స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పాత కార్యకర్తలు, కొత్తగా చేరిన నాయకుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ పదవుల పంపిణీ, నాయకత్వ పోటీ నేపథ్యంలో గ్రూపు రాజకీయాలు మరింత ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి దిగుమతి ఆయి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల మీద పోటీ చేస్తున్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చేటప్పుడు వారితో ఒక కార్యకర్త, ఒక నాయకుడు కూడా రావడం లేదని సీనియర్ బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధులుగా బీజేపీలో ప్రాతినిథ్యం నిర్వహించాలనుకుంటున్న నాయకులు ఒక్క వార్డ్ మెంబర్ ని కాని, ఒక సర్పంచ్ ని గాని ఒక కార్పొరేటర్ ను కూడా గెలిపించుకున్న పాపాన పోలేదని సోషల్ మీడియాలో బీజేపీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఒక వర్గం నాయకులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న పోస్టులు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని కొందరు సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలను బహిరంగ వేదికలపై కాకుండా అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాలని వారు సూచిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్గం మాత్రం ఇవన్నీ తమ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు జరుగుతున్న దుష్ప్రచారమని చెబుతోంది. ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తానికి రామగుండం బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. పార్టీపై పట్టు సాధించేందుకు వివిధ వర్గాలు వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో, చివరకు ఎవరిది పైచేయి అవుతుందో, గ్రూపు రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి మ‌రీ.

Next Story