- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిండికేట్‌కు పత్తి రైతులు కుదేలు
పత్తి మిల్లుల్లోని వేబ్రిడ్జి (తూకం యంత్రాల)పై రైతులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిల్లులోని

దిశ, జమ్మికుంట టౌన్ : జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రైతుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మార్కెట్ నియమాలు, నిబంధనలను బేఖాతరు చేస్తూ బడా పత్తి మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి రైతులు పండించిన పత్తికి సరైన ధర దక్కకుండా అడ్డుకుంటున్నారు. మార్కెట్ అధికారులు, కమిటీ మిల్లర్ల చెప్పుచేతల్లో నడుస్తూ రైతులు నష్టపోతున్నా చర్యలు తీసుకోకపోవడంపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సిండికేట్ గుప్పిట్లో రైతులు..
జమ్మికుంట మార్కెట్‌లో పత్తి మిల్లర్ల యాజమాన్యం పటిష్టమైన సిండికేట్‌ను నడుపుతోంది. ఈ సిండికేట్ కారణంగా రైతులకు మార్కెట్‌లో వేసిన పత్తి ధర నుంచి క్వింటాల్‌కు రూ.200నుంచి రూ.500వరకు తరుగు పేరుతో క్యాష్ కటింగ్ పేరుతో అన్యాయంగా కోత విధిస్తున్నారు. అంతేకాకుండా తూకాల్లో తేడాలు చూపించడం నేరుగా మిల్లులకు పత్తిని తీసుకురావాలని ఒత్తిడి చేయడం ద్వారా మిల్లర్లు తమ ఇష్టానుసారం ధరలు నిర్ణయించి పత్తి రైతులను దోపిడీకి గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తరుగు పేరుతో వినూత్న మోసం..
పత్తి ధరలో తరుగు తీయడంలో బడా మిల్లర్ల పంథా వేరుగా ఉంది. ముఖ్యంగా వజ్ర కల్ప కాటన్ మిల్లులో అనుసరిస్తున్న విధానం మిగతా మిల్లర్ల కంటే భిన్నంగా మరింత దోపిడీకి దారితీసేలా ఉందని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో ధర వేసుకుని మిల్లుకు వచ్చిన పత్తి వాహనాలను వరుసలో ఉంచి తనిఖీ చేయకుండానే ముందుగా రూ.200నుంచి రూ.500 వరకు ధర తరుగు వేస్తున్నారు. ఇతర మిల్లుల్లో పత్తిని అన్‌లోడ్ చేసే ముందుగా చూసి తరుగు వేస్తే వజ్ర కల్ప కాటన్ మిల్లులో మాత్రం తరుగు వేసిన తర్వాతే పత్తిని అన్‌లోడ్ చేసుకోవడం గమనార్హం. దీనివల్ల ధర విషయంలో రైతులు ప్రశ్నించడానికి అవకాశం లేకుండా పోతోంది.
పత్తి తూకంలో మోసాలు..
పత్తి మిల్లుల్లోని వేబ్రిడ్జి (తూకం యంత్రాల)పై రైతులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిల్లులోని వేబ్రిడ్జిలలో తరుగు చూపిస్తున్నాయని దీని ద్వారా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తూకాల్లో తేడాలు రావడం వల్ల మార్కెట్‌లోని వేబ్రిడ్జిపై తూకం వేసిన తరువాతే మిల్లులకు పత్తిని తరలించి అమ్మకాలు జరిపేవారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లోని వేబ్రిడ్జి నిరుపయోగంగా ఉండడాన్ని మిల్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మార్కెట్‌లో నిరుపయోగంగా ఉన్న వేబ్రిడ్జి తూకాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల ప్రేక్షకపాత్ర...
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర వేశాక మిల్లులోకి వెళ్లిన ప్రతి వాహనం నుంచి మళ్లీ ‘క్లీనింగ్ శాతం’ అంటూ పత్తి శుభ్రంగా లేదనే మాయమాటలతో అదనంగా తరుగు వేసి రైతులను దోచుకుంటున్నారు. రైతులు కళ్ల ముందు దోపిడీకి గురవుతున్నా మార్కెట్ అధికారులు, మార్కెట్ కమిటీ దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతులు మార్కెట్‌ను నమ్మలేక నేరుగా మిల్లర్లను ఆశ్రయించి అమ్మకాలు జరుపుతున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు మరింతగా రైతులను దోచుకుంటున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బడా మిల్లర్ల సిండికేట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.






