- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపల్లి జిల్లాలో కల్తీ దందా..ప్రజల ప్రాణాలతో చెలగాటం
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాఫీగా నడుస్తోంది.

పెద్దపల్లి జిల్లాలో కల్తీ దందా..
కోట్లల్లో సాగుతున్న 'జీరో బిల్లు'ల వ్యాపారం
మార్కెట్లోకి పోటెత్తుతున్న నాసిరకం సరుకులు
హైదరాబాద్, మహారాష్ట్రల నుంచి భారీగా దిగుమతి
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వ్యాపారులు
మామూళ్ల మత్తులో సంబంధింత అధికారులు
దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాఫీగా నడుస్తోంది.పెద్దపల్లిలో ని ప్రధాన వాణిజ్య కేంద్రం కల్యాణ్ నగర్.. క్రమంగా 'కల్తీ బజార్'గా మారుతోంది. హోల్ సేల్, రిటైల్ దుకాణాలకు నిలయమైన ఈ ప్రాంతం నుంచి రామగుండం పారిశ్రామిక వాడతో పాటు చుట్టుపక్కల వందలాది గ్రామాలకు నిత్యావసర సరుకుల సరఫరా జరుగుతుంది. నెలకు కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఈ కేంద్రంలో, లాభాపేక్షతో కొందరు వ్యాపారులు అక్రమాలకు తెరలేపారు. పన్నులు ఎగవేస్తూ 'జీరో బిల్లు'లతో దందా సాగిస్తూ, నాసిరకం సరుకులను ప్రజలకంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
హోల్ సేల్ దుకాణాలు కిటకిట
కల్యాణ్ నగర్‌లోని హోల్ సేల్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. మంథని, రామగుండం, అంతర్గాం తదితర మండలాల నుంచి చిరు వ్యాపారులు ఇక్కడి నుంచే సరుకులు తీసుకెళ్తుంటారు. ఇదే అదనుగా కొందరు బడా వ్యాపారులు హైదరాబాద్‌లోని బేగం బజార్, మహారాష్ట్రల నుంచి నాసిరకం సరుకులను భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. బేగం బజార్‌లోని కొన్ని కుటీర పరిశ్రమల్లో తయారయ్యే నకిలీ సరుకులకు.. బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లు అంటించి, ఎవరూ గుర్తుపట్టని విధంగా మార్కెట్లోకి డంప్ చేస్తున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి నాసిరకం పిండి పదార్థాలు, వంట నూనెలు 'జీరో బిల్లు'లపై ఇక్కడికి చేరుకుంటున్నాయి. చూసేందుకు అసలైన బ్రాండెడ్ సరుకుల్లాగే మెరిసిపోతున్న ఈ కల్తీ వస్తువులను చూసి సామాన్య ప్రజలు సులువుగా మోసపోతున్నారు. ఇక్కడి మార్కెట్లో లభించే వస్తువుల్లో దాదాపు 60 శాతం నాసిరకంవేనన్న ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది. గతంలో కాలం చెల్లిన వస్తువులు విక్రయిస్తూ పలువురు పట్టుబడిన దాఖలాలు కూడా ఉన్నాయి.
ప్రజారోగ్యంపై పెను ప్రభావం..!!
వ్యాపారుల కాసుల కక్కుర్తి సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. నాసిరకం వంట నూనెలు, కల్తీ పిండి పదార్థాలు, రంగులు అద్దిన తినుబండారాలు తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, భవిష్యత్తులో క్యాన్సర్ వంటి మహమ్మారుల భారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు సరుకులు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
పత్తాలేని ఫుడ్ ఇన్‌స్పెక్టర్..
కల్తీ దందా ఇంత బహిరంగంగా సాగుతున్నా.. అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రామగుండం లాంటి పెద్ద పారిశ్రామిక ప్రాంతానికి కనీసం రెగ్యులర్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లేకపోవడం గమనార్హం. ఏదైనా తనిఖీలు చేయాల్సి వస్తే ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి ఇన్‌ఛార్జి అధికారి రావాల్సిందే. ఇక నగర పాలక సంస్థ (బల్దియా) హెల్త్ విభాగం అధికారులకు కేవలం తనిఖీలు చేసి, నామమాత్రపు జరిమానాలు విధించే వరకే అధికారం ఉంది. చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నెలవారీగా ముడుపులు అందుతుండటం వల్లే తనిఖీ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల ఉదాసీనతతోనే వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రామగుండం నగర పాలక సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సమన్వయంతో పెద్దపల్లి జిల్లా లో విస్తృత తనిఖీలు చేపట్టి, కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






