- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి ఆర్జీ-వన్ఎస్ అండ్ పీసీలో అవినీతి అధికారులు
సింగరేణి కోట్ల రూపాయల ఆస్తులను కాపాడవలసిన సెక్యూరిటీ అధికారులు వారి స్వలాభం కోసం సింగరేణి సంస్థను వాడుకుంటున్నారు.

సింగరేణి ఆర్జీ-వన్ఎస్ అండ్ పీసీలో
అవినీతి అధికారులు
సంస్థ ఆస్తులను భక్షిస్తున్న రక్షకులు
అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెదిరింపులు
అధికారుల అండతో ఇష్టారాజ్యం?
దిశ, గోదావరిఖని : సింగరేణి కోట్ల రూపాయల ఆస్తులను కాపాడవలసిన సెక్యూరిటీ అధికారులు వారి స్వలాభం కోసం సింగరేణి సంస్థను వాడుకుంటున్నారు. తులసి వనంలో గంజాయి మొక్కలా కొందరు సింగరేణి ఎస్ అండ్ పీసీ అవినీతి అధికారులు వారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ విషయంపై ఆ సంస్థలోని సెక్యూరిటీ గార్డులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. సింగరేణికి గుండె లాంటి రామగుండం రీజియన్-1లో అవినీతి ఎస్అండ్ పీసీ అధికారులు సంస్థ ఆస్తులను రక్షించాల్సింది పోయి సొంత ఆస్తులను కూడబెట్టుకునే పనిలో పడ్డారని వారి తోటి ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. వృత్తిలో నైపుణ్యాన్ని చూపించాల్సిన ఎస్ అండ్ పీసీ ఇంటలిజెన్స్ వ్యవస్థ, ఉన్నతాధికారుల ఆశీస్సులతో వచ్చిన సొమ్మును వాటాలుగా పంచుకుంటున్నారని ఆర్జి-1 లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఆర్జీ వన్ లో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహించిన కొంతమంది ఉద్యోగులు అధికారులుగా (సూపర్వైజర్లుగా) పదోన్నతి పొంది ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సదరు అవినీతి అధికారులు సంస్థ లూప్ హోల్స్ ఉపయోగించుకొని అవినీతికి పాల్పడుతున్నట్లు సెక్యూరిటీ విభాగంలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
గార్డు నుంచి సూపర్వైజర్లుగా మారిన అధికారులు అప్పటివరకు ఉన్న తోటి ఎస్ అండ్ పీసీ గార్డులపై జులూం చూపిస్తూ పైశాచికానందం పొందుతున్నారని విమర్శలు ఉన్నాయి. సెక్యూరిటీ గార్డుల సమస్యలు, విధి నిర్వహణలో లోపాలను ఆసరాగా చేసుకుని సదరు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని గార్డులు గుర్రుగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే సెక్యూరిటీ సిబ్బంది కొరతతో ప్రైవేటు గార్డులను సింగరేణి సంస్థ కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకుంటే, అవినీతి ఎస్ అండ్ పీసీ అధికారులు వారిని ఇంటి పనులకు వినియోగించుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను సంస్థ రక్షణకు కాకుండా పని మనుషుల్లా వాడుకొని, అవమానిస్తున్నారని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎస్ అండ్ పీసీ అధికారులు చెప్పింది చేస్తేనే ప్రైవేటు గార్డులకు డ్యూటీ... లేదంటే వారిని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ విధుల నుంచి తొలగిస్తున్నారు. సెక్యూరిటీ అధికారుల వేధింపులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలగించిన వారిని తిరిగి డ్యూటీ లోకి చేర్చుకోవాలంటే సెక్యూరిటీ అధికారులకు తులమో, ఫలమో సమర్పించుకోవాల్సి వస్తుందని వారి ఆవేదనను బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. చిన్నాచితక కారణాలతో పక్కన పెట్టిన ప్రైవేట్ గార్డులను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ అధికారులు పరేషాన్ చేస్తున్నారు. ఓ సెక్యూరిటీ అధికారి ఇటీవల ప్రైవేటు గార్డును విధులనుంచి పక్కన పెట్టడం, ఆతర్వాత అధికారికి సంబంధించిన మధ్యవర్తి గార్డు నుంచి మూడు మద్యం బాటిళ్లను డిమాండ్ చేయడంతో ఆర్జీ-వన్ ఎస్ అండ్ పీసీ కార్యాలయంలో పంచాయితీ వరకు వెళ్లిందని సమాచారం.
పక్కన పెట్టిన మరికొంతమంది ప్రైవేట్ గార్డులను శాశ్వతంగా తొలగించి వారి స్థానంలో లక్షలు వసూలు చేసి కొత్తవారిని విధుల్లోకి చేర్చుకోవడం ఇక్కడ బహిరంగ రహస్యమే. ఆర్జీ-వన్ అవినీతి ఎస్ అండ్ పీసీ అధికారులు తన యూనియన్ నాయకున్నీ సంస్థ పెట్రోల్ బంకులో దీర్ఘకాలికంగా విధులు పురమాయించారని, ఇది చాలదన్నట్లు వరుసకు చుట్టమైన మరో గార్డును ఇంటలిజెన్స్ విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా విధులు కేటాయించడం విమర్శలకు దారితీస్తుంది. తానే అధికారి... తానే యూనియన్ ప్రతినిధి అంటూ అవినీతి అరాచకాలకి పాల్పడడంతో ఎస్ అండ్ పీసీ తో పాటు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిసింది. అవినీతి ఎస్ అండ్ పీసీ అధికారుల ఆగడాలు సెక్యూరిటీ బాస్ కు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు బలం చేకూరుతుంది. సదరు సెక్యూరిటీ అధికారులు పరపతితో తన సీటుకు ఎసరు రాకుండా ధృతరాష్ట్రుడి అవతారమెత్తినట్లు ఆర్జీ-వన్ ఎస్ అండ్ పీసీ గ్రూప్ లో చిట్ చాట్ నడుస్తుంది. ఇంత నడుస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంలో మర్మమేమిటో ఎవరికి తెలియదు. ఇదంతా సింగరేణి ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందా? ఇప్పటికైనా ఆర్జీ-వన్ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని అవినీతి సెక్యూరిటీ అధికారులపై చర్యలు చేపట్టి గార్డులకు రక్షణ కల్పించాలని వారు సింగరేణి అధికారులను వేడుకుంటున్నారు.






