పంచాయతీ కార్మికులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సీఐటీయూ

by Ratna Kumari |

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికులను మోసం చేస్తోందని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ విమర్శించారు.

పంచాయతీ కార్మికులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సీఐటీయూ
X

దిశ, ​హుజురాబాద్ రూరల్ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికులను మోసం చేస్తోందని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ విమర్శించారు. గురువారం హుజురాబాద్ హమాలీ యూనియన్ కార్యాలయంలో గ్రామపంచాయతీ యూనియన్ మండల కమిటీ సమావేశం ఆకునూరి సుధాకర్ అధ్యక్షతన నిర్వ‌హించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు.

జీతాల చెల్లింపులో బాధ్యతారాహిత్యం

​గత మూడు నెలలుగా పంచాయతీ కార్మికులకు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి నేరుగా వేతనాలు చెల్లించేదని కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ బాధ్యతను గ్రామ పంచాయతీలకే అప్పగిస్తూ సర్క్యులర్ జారీ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా అకౌంట్లలో వేతనాల హామీలు రెండేళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదన్నారు. పంచాయతీలలో నిధులు లేక అభివృద్ధి పనులకే ఇబ్బంది అవుతుంటే, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జీతాలు చెల్లించమనడం హాస్యాస్పదమన్నారు.ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు లేని కార్మికులకు 8 నుంచి 12 నెలల వరకు వేతనాలు బకాయి ఉన్నాయి.

ఆందోళన తప్పదు..

ప్రభుత్వం తన మొండి వైఖరి వీడకపోతే కార్మికులను ఐక్యం చేసి దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్మికులను మళ్లీ బానిసత్వంలోకి నెట్టేలా ఉన్న ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బిక్షపతి, కమిటీ సభ్యులు మాడుగుల ఉమా, ఎల్లయ్య, మంద లక్ష్మి, ఇమ్మడి రాజు, ఎడ్ల శ్రవణ్, అరవింద్‌ పాల్గొన్నారు.

Next Story