బీఆర్ఎస్, కాంగ్రెస్ గత చరిత్రనే తవ్వుతున్నాయి.. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు: కవిత

by Kodari Anjali |

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదివారం డా. రఘు ఆధ్వర్యంలో నిర్వహించిన పాంచజన్య కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ గత చరిత్రనే తవ్వుతున్నాయి.. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు: కవిత
X

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదివారం డా. రఘు ఆధ్వర్యంలో నిర్వహించిన పాంచజన్య కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. రఘును, ఆయన అనుచరులను టీఆర్ఎస్ పార్టీలోకి కవిత కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం కవిత మాట్లాడుతూ... నిరుద్యోగుల పక్షాన, మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు, గత చరిత్రనే తవ్వుకుంటున్నాయే తప్ప ప్రస్తుతం ప్రజలకు చేయాల్సిన పనులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఒకరిపై ఒకరు తప్పులు ఆరోపించుకోవడంలోనే కాలం గడుపుతూ.. యువత భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

షుగర్ ఫ్యాక్టరీ ఊసేంతని.. కవిత వ్యాఖ్యలపై రైతుల్లో నిరుత్సాహం

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై కవిత వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ హయాంలో 100 రోజుల్లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం అని చెప్పిన కవిత, నేటి సభలో ఆ ప్రస్తావనే తీసుకురాకపోవడంపై స్థానిక రైతులు, కార్మికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక కవిత పార్టీలో చేరేందుకు కోరుట్ల నియోజకవర్గంలో కీలక నేతలు, కార్యకర్తలు ముందుకు రాకపోవడంతో, కోరుట్లలో ముందు వరుసలో ఉన్న బీఆర్ఎస్‌పై ఆమె పార్టీ నిజంగా పుంజుకుంటుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడిన కవిత బీజేపీపై మాత్రం ఒక్క మాట కూడా అనకపోవడం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

Next Story