జోరుగా ఇసుక రీచ్​దందా.. రంగంలోకి కలెక్టర్, పోలీస్ కమిషనర్

by Malleboina Mahesh |

భయం భయంగా ప్రయాణం, రోడ్డు దించేదే లే..నీకింత నాకెంత అంటూ ఇసుక రీచ్ నిర్వాహకుల దందాలపై ‘దిశ’లో ప్రచురితమైన వరుస కథనాలతో జిల్లా యంత్రాంగం కదిలివచ్చింది.

జోరుగా ఇసుక రీచ్​దందా.. రంగంలోకి కలెక్టర్, పోలీస్ కమిషనర్
X

దిశ బ్యూరో, కరీంనగర్: భయం భయంగా ప్రయాణం, రోడ్డు దించేదే లే..నీకింత నాకెంత అంటూ ఇసుక రీచ్ నిర్వాహకుల దందాలపై ‘దిశ’లో ప్రచురితమైన వరుస కథనాలతో జిల్లా యంత్రాంగం కదిలివచ్చింది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ రంగంలోకి దిగారు. ఇసుక రీచ్‌లను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీచ్ నిర్వహించాలని తేడాలు వస్తే సహించేది లేదని, అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు .

చల్లూర్ ఇసుక రీచ్ ను సందర్శించిన కలెక్టర్, సీపీ

ఇసుక రీచ్‌ల నిర్వహణ అక్రమ ఇసుక రవాణ పై దిశ పత్రికలో వరుస కథనాలు ప్రచురించడంతో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ చల్లూర్ ఇసుక రీచ్‌లను సందర్శించారు. టీజీ ఎండీసీ సిబ్బంది ఇసుక క్వారీ వద్ద ఇసుక లోడింగ్ చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంలు హెచ్చరించారు. ఇసుక రవాణా సందర్భంగా అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

ఇసుక లోడింగ్ వేయింగ్ బ్రిడ్జిల పనితీరు పరిశీలన

వీణవంక మండలం చల్లూరు లోని ఇసుక రీచ్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ టీజీ ఎండీసీ ఇసుక క్వారీ వేయింగ్ బ్రిడ్జి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇసుక లారీ లోడింగ్ వెయిట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. క్వారీ సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వే బిల్లులు డీడీలు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, సీపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి లారీ ఇసుక లోడింగ్ కు వచ్చే సమయంలో లారీలను వెయిట్ చేయాలని లోడింగ్ అయిన తర్వాత మళ్లీ ఒకసారి వెయిట్ చేయాలని సూచించారు. ఇసుక రవాణా చేసే ప్రతి లారీ ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలను సాండ్ ఆడిట్ యాప్ లో కచ్చితంగా నమోదు చేయాలన్నారు. రికార్డుల్లో ఎలాంటి తేడాలు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు.

లారీల పార్కింగ్ పై ఆగ్రహం

ఇసుక రీచ్ నిర్వాహకులు రీచ్ లో ఇసుక తరలించేందుకు వచ్చే లారీలకు పార్కింగ్ ఏర్పాటు చేయాలని రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక తరలించే సమయంలో లారీ డ్రైవర్లు తప్పనిసరిగా ఇసుకపై టార్ఫాలిన్ కవర్లు కప్పి తీసుకెళ్లాలని సూచించారు. దీనివల్ల ఇసుక రోడ్డుపై పడకుండా ఉంటుందని వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. కస్టమర్లు డీడీ చెల్లించిన ప్రకారం ఇసుక లోడింగ్ చేయాలని ఎక్కడైనా తేడాలు వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు . ఈ విషయంలో క్వారీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఇసుక లారీ డ్రైవర్లు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

లోడింగ్ వెయిటింగ్ చేసే సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యేలా పర్యవేక్షించాలని ఆ మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. లోడింగ్, లారీ వివరాల నమోదు చేసే గదిలో సీసీ కెమెరాలు అవసరమైన కంప్యూటర్లు అన్ని సక్రమంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిదీ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. లోడింగ్ విషయంలో ఎక్కడ కూడా నిబంధనలు అతిక్రమించి వద్దని కలెక్టర్, సీపీ సిబ్బందికి స్పష్టం చేశారు.

చెక్ పోస్టుల తనిఖీ

ఇసుక రీచ్ లను సందర్శించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ లు వీణవంక మండలం మామిడాల పల్లి, మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామాల్లో ఇసుక చెక్ పోస్టులను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ రికార్డులను పరిశీలించారు. ప్రతి ఇసుక లారీ కి సంబంధించిన వే బిల్లులు, డీడీలు జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. తద్వారా అక్రమ రవాణా చేసే వాహనాలను నియంత్రించాలని పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణా, అక్రమ ఇసుక నిల్వలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని ఈ మేరకు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్ పోలీస్ కమిషనర్ తో పాటు ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, హుజూరాబాద్ ఏసీపీ మాధవి, వీణవంక మానకొండూరు తహసీల్దార్లు అనుపమ, విజయ్ టీజీ ఎండీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్ కుమార్ పలువురు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్, సీపీ ఫైర్​

ఇసుక రవాణాపై పగడ్బందీగా పర్యవేక్షిస్తున్న రెండు రోజుల అనుమతులు లేకుండా జిల్లా సరిహద్దులు దాటుతూ పట్టుబడటం అధికారులకు ఆగ్రహం తెప్పించింది. ఇసుక అక్రమ రవాణా జరిగితే కఠినంగా వ్యవహరిస్తాం.. కేసులు నమోదు చేస్తామని రీచ్​ నిర్వాహకులను హెచ్చరించారు. తనిఖీల కోసం ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.

Next Story