జంగాపల్లిలో ఊస‌ర‌వెల్లి రాజ‌కీయం

by Ratna Kumari |

గ‌న్నేరువ‌రం మండ‌ల ప‌రిధిలోని జంగాప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ భ‌ర్త బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ను ఊస‌ర‌వెల్లిలా మారుతున్నాడ‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

జంగాపల్లిలో ఊస‌ర‌వెల్లి రాజ‌కీయం
X

దిశ, గన్నేరువరం: మండలంలో అత్యంత చైతన్యవంతమైన అధిక ఓటర్లు కలిగిన గ్రామం జంగాపల్లి. నాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉండగా.. నామినేటెడ్ పదవి వరించడానికి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీపై ఇష్టారీతిగా మాట్లాడి నామినేటెడ్ పదవి పొందారు ప్రస్తుత సర్పంచ్ భర్త తాడూరి వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదు. అభివృద్ధి జరగడం లేదు అని సోషల్ మీడియా వేదికగా ప్రచారాలను నిర్వహించారు.

గ్రామ ప్రజలకు మితిమీరిన వాగ్దానాలు చేసి ఎట్టకేలకు తన సతీమణి నీ సర్పంచ్ గా గెలిపించుకొని ,గ్రామ ప్రజలకు సేవ చేయాల్సిన నాయకుడు రసమయి బాలకిషన్ కు రామ్ రామ్ పలికి ప్రత్యేక ఎంపీ నిధులు వస్తాయని ఆశించి బీజేపీలో చేరారు. ఈ స్వల్ప వ్యవధిలో నిధులు మంజూరు కాలేదు. గ్రామంలో ఏ అభివృద్ధి పనులు జరగలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే తోటే అభివృద్ధి సాధ్యమని అనుకున్నాడేమో ఎట్టకేలకు కమలం పువ్వుకు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మండల కాంగ్రెస్ నాయకుల మంతనాలతో ఏ హామీ తీసుకున్నాడో ప్రజలకు తెలియదు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి కాంగ్రెస్ కి మారడంతో జంగాప‌ల్లి సర్పంచ్ భర్త తాడూరి రమణారెడ్డి తీరు ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా ఉన్నదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీలో చేరిన విషయం సోషల్ మీడియా వేదికగా బహిర్గతం అయిన వెంటనే గ్రామానికి చెందిన ఆయన దగ్గర బంధువు తాడూరి వంశీకృష్ణారెడ్డి రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారిన వ్యక్తులను కొత్త రకం దండలతో సన్మానించాలని పోస్ట్ పెట్టడం గ్రామంలో చర్చనీయాంశం గా మారింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ భర్తకు కండువా కప్పి సర్పంచ్ పార్టీ మారిందని ప్రచారం చేయడంతో సర్పంచ్ భర్త ఉప సర్పంచ్ పార్టీ మారితే సర్పంచ్ మారినట్టు ప్రచారం ఏమిటని సోషల్ మీడియా వేదిక గా ప్రశ్నిస్తున్నారు ప్రజలు. సర్పంచ్ భర్త అయితే పార్టీ మారిండు.. మరి సర్పంచ్ ఎప్పుడు కాంగ్రెస్ లో చేరుతుందో వేచి చూడాలి. గ్రామ సంక్షేమ కోసం అభివృద్ధి కోసం పాటుపడే నాయకులకు పార్టీలతో పని ఏముంటుంది? స్వలాభం కోసమే రంగులు మార్చినట్టు కండువాలు మార్చుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బూతులు తిడుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండతో ఏ మేరకు గ్రామ అభివృద్ధి జరుగుతుందో వేచి చూడాలని ప్రజలు పేర్కొంటున్నారు.

Next Story