బ్రేకింగ్: MP బండి సంజయ్ అరెస్ట్.. జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్తత

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: MP బండి సంజయ్ అరెస్ట్.. జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, కరీంనగర్ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు బ్రేకులు వేసేందుకు పోలీసు అధికారులు సమాయత్తం అయ్యారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ నుండి బయలుదేరిన సంజయ్‌ని అరెస్ట్ చేసేందుకు జగిత్యాల, నిజామాబాద్ హైవేపై పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. జగిత్యాల సమీపంలోని తాటిపల్లి వద్ద సంజయ్‌ని అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన మిస్ అయ్యారు. దీంతో పోలీసులు సంజయ్‌ని వెంబడించగా ఆయన మేడిపల్లి మాజీ సర్పంచ్ బొంగోని రాజాగౌడ్ ఇంట్లోకి వెళ్లారు. ఆయన ఏ క్షణంలో బయటకు వచ్చినా అరెస్ట్ చేయాలని పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

చివరకు రాత్రి 8 గంటల ప్రాంతంలో బయటకు వచ్చి పోలీసులకు చిక్కుండా తప్పించుకుంటూ వెళ్తున్న బండి సంజయ్‌ని కోరుట్ల సమీపంలోని వెంకటాపూర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనాలు పెద్ద ఎత్తున చుట్టు ముట్టడంతో సంజయ్ వాహానాన్ని ఆపాల్సి వచ్చింది. ఆదివారం సాయంత్రం నుండే మెట్ పల్లి, కోరుట్ల నేషనల్ హైవేపై పోలీసులు కాపు కాసి సంజయ్ అరెస్ట్ కోసం స్కెచ్ వేశారు. అయితే ఆయన మద్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ నుండి బయలుదేరాల్సి ఉండగా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వెళ్లారు. మధ్యలో కార్యకర్తలను కలుస్తూ వెళ్తున్న క్రమంలో సంజయ్‌ని అరెస్ట్ చేసేందుకు జగిత్యాల జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది.

ఎక్కడి వాహనాలు అక్కడే..

కరీంనగర్ నుండి సంజయ్ పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన బీజేపీ క్యాడర్‌కు సంబంధించిన వాహనాలు పెద్ద ఎత్తున జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన నాయకులు కూడా పెద్ద సంఖ్యలో భైంసాకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ నాయకులు తమతమ వాహనాల్లో ఎక్కడికక్కడ ఆగిపోయారు.

పోలీసుల భారీ వ్యూహం..

పోలీసులు బండి సంజయ్ పాదయాత్ర విషయంలో ఆదివారం సాయంత్రం వరకూ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వకుండా నిమ్మకుండి పోతుండడంతో అంతా సవ్యంగా జరుగుతోందని బీజేపీ నాయకులు అనుకున్నారు. అనూహ్యంగా బండి సంజయ్ కరీంనగర్ నుండి బయలుదేరి వెళ్లారన్న సమాచారం అందుకున్న తరువాత పోలీసులు సంజయ్ పాదయాత్రకు కానీ బహిరంగ సభకు కానీ అనుమతి ఇవ్వలేదని ప్రకటన విడుదల చేయడం గమనార్హం. చివరి క్షణం వరకూ కూడా పోలీసులు బీజేపీ నాయకుల మూవ్ మెంట్‌ను తెలుసుకుంటూ పర్మిషన్ లేదని ప్రకటన ఇవ్వడంతో బీజేపీ నాయకుల అంచనాలు తలకిందులయ్యాయి.

ఆదివారం సాయంత్రం వరకూ అంతా ప్రశాంతంగా సాగుతుండడంతో ఎలాంటి ఆటంకం లేదన్న ధీమా కల్పించిన పోలీసులు బండి యాత్రకు బ్రేకులు వేశారు. దీంతో ఇతరత్ర ప్రయత్నాలు చేసే అవకాశం కూడా లేకుండా చేశారు. అయితే పోలీసులు ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం భైంసా అత్యంత సున్నితమైన పట్టణం అయినందున అనుమతి ఇవ్వలేదని చెప్తున్నందున ప్రత్యామ్నాయ వేదికకు పర్మిషన్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా జగిత్యాల జిల్లాలో మాత్రం పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు బండి పాదయాత్రను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ నిరసలనకు దిగారు. హైవేపై రాస్తారోకోలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి తీరుతాం: MP బండి సంజయ్


Next Story

Most Viewed