బీజేపీలో స్థానిక సంస్థల టికెట్ల లొల్లి

by Yella Dhawani Reddy |

కరీంనగర్ జిల్లా బీజేపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల టికెట్ల గొడవ మొదలైంది.

బీజేపీలో  స్థానిక సంస్థల టికెట్ల లొల్లి
X

దిశ,హుజురాబాద్: కరీంనగర్ జిల్లా బీజేపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల టికెట్ల గొడవ మొదలైంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటల వర్గానికి టికెట్లు రానివ్వకుండా బండి సంజయ్ వర్గం ప్రయత్నం చేస్తూ కార్యకర్తలను తొక్కి పెడుతుందని భావించిన ఈటల వర్గం వరుసగా మూడు రోజుల నుంచి శామీర్​పేటలోని ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్‌కి ప్రచారం చేయకుండా ఈటల వర్గం ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కై నష్టం చేశారని భావించిన బండి వర్గం ఈసారి ఎన్నికల్లో వారికి టికెట్టు రాకుండా అడ్డుపడాలని ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు వారు గ్రామాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ తమకే టికెట్లు వస్తాయని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఈటల వర్గం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందని భావించి ఈటలపై ఒత్తిడి తెచ్చి తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలని భావించి రాజధానికి పరుగులు పెడుతున్నారు. తన ఇంటికి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడిన ఈటల రాజేందర్ వారికి నచ్చచెప్పి ఈ విషయమై అధిష్టానంతో మాట్లాడుతానని వారికి హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మిగతా కార్యకర్తలు సైతం గత మూడు రోజులుగా వరుస పెట్టి ఈటల ఇంటికి పరుగులు పెడుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో పోటీ కోసం కసరత్తు

హుజూరాబాద్ నియోజక వర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయడానికి ఈటల కసరత్తు మొదలు పెట్టాడని ప్రచారం జరుగుతుంది. మొన్నటి ఎన్నికల్లో త్రిముఖ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడి పోయిన ఈటల రాజేందర్ మకాం ఇక్కడి నుంచి ఎత్తేసి మల్కాజ్గిరి ఎంపీగా హైదరాబాద్‌ కు మార్చిన విషయం విధితమే. అయినప్పటికి ఇక్కడి క్యాడర్‌తో నిరంతరం టచ్‌లో ఉన్న ఆయనపై బీజేపీ క్యాడర్‌తో పాటుగా కొంతమంది ఇతర పార్టీలకు చెందిన వారు సైతం మళ్లీ ఇక్కడ ఆక్టివ్ పాలిటిక్స్ చేయాలని కోరడంతో స్థానిక సంస్థల ఎన్నికలను వేదిక చేసుకొని తిరిగి హుజురాబాద్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తూ ఇందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇందుకు గాను ఈటల ను తిరిగి నియోజకవర్గంలో అడుగు పెట్టి బండికి ప్రత్యామ్నాయ రాజకీయం చేయాల్సిందిగా కోరుతూ లేకపోతే గత 20 సంవత్సరాలుగా ఈటలను నమ్ముకుని వెన్నంటి ఉన్నందుకు బూడిదే మిగులుతుందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈటల కార్యకర్తల అభిప్రాయం మేరకు తిరిగి హుజురాబాద్‌లో అడుగు పెడతానని ముఖ్య నాయకులకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఈటలను టార్గెట్ చేసిన బండి వర్గం

హుజూరాబాద్ రాజకీయాల్లోకి ఈటల తిరిగి అడుగు పెట్టకుండా చేయడానికి సోషల్ మీడియా వేదికగా బండివర్గం దుష్ప్రచారం చేస్తుంది. బండి సంజయ్ మాత్రం బండి జిందాబాద్, ఈటల జిందాబాద్ అంటే టికెట్లు రావని, బీజేపీ జిందాబాద్ అంటేనే టికెట్లు వస్తాయని తెలుపడం గమనార్హం. హుజూరాబాద్ బీజేపీలో ప్రస్తుతం రాజు లేని రాజ్యంలా ఉంది. నియోజకవర్గ ఇన్​చార్జి మాడ గౌతం రెడ్డి రాజీనామా చేయడం, జిల్లా అధ్యక్షులుగా ఉన్న కృష్ణారెడ్డికి పార్టీపై అంతగా పట్టు లేకపోవడం మైనస్ పాయింట్లుగా మారాయి. ఎల్లప్పుడూ ఎంపీ, కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్‌ను వెన్నంటి ఉండటం తప్ప బీజేపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడంలో కృష్ణారెడ్డి విఫలం అయ్యారని పార్టీ శ్రేణులు, అభిమానులు అంటున్నారు. దీంతో హుజురాబాద్‌లో ప్రస్తుతం బీజేపీకి కింది స్థాయిలో కార్యకర్తలు ఉన్నా సరైన నాయకులు లేక పార్టీ డీలా పడిపోతుందని విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ విషయమై కార్యకర్తలు సరైన నాయకుని కోసం ఈటల ఇంటికి క్యూ కడుతున్నారు అని ప్రచారం జరుగుతుంది.

హుజూరాబాద్ లో అన్ని సీట్లు మనవే

హుజూరాబాద్‌లో బీజేపీ‌లో ఉన్న నాయకులు అంతా తనవాళ్లేనని, ఎన్నికల్లో అందరినీ నిలబెట్టి గెలిపించుకుంటానని ఈటల కార్యకర్తలతో అన్నారు. ఎంపీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో 50 వేల మెజారిటీ వచ్చిందని, తాను బీజేపీ‌లోకి రాక ముందు క్యాడర్ లేదని, తనపై దుష్ప్రచారం చేస్తే వారు పలచన పడుతారని బండి వర్గాన్ని ఇన్ డైరెక్ట్‌గా విమర్శించారు. రానున్న రోజుల్లో అన్ని సీట్లు తన క్యాడర్‌కే వస్తాయని, ఎవరు నిరాశ పడవద్దని వారికి అభయం ఇచ్చారు.

Next Story