భూ భారతి చట్టం పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి..

by Bhanu |

దేశానికి ఆదర్శంగా ప్రభుత్వ రూపొందించిన భూ భారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

భూ భారతి చట్టం పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి..
X

దిశ, ఎలిగేడు : దేశానికి ఆదర్శంగా ప్రభుత్వ రూపొందించిన భూ భారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం - 2025 పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు ప్రోటోకాల్ &పబ్లిక్ రిలేషన్స్ హర్కర వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ టి.భాను ప్రసాద్ రావు లతో కలిసి పాల్గొన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,గత ప్రభుత్వ పెద్దలు స్వార్థ పూరితంగా నాలుగు గోడల మధ్య ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ధరణి చట్టం తయారు చేసిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం దేశంలోనే 18 రాష్ట్రాల్లోనే 20 చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వేల మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వారి కోరిక మేరకు భూ భారతి చట్టం తయారు చేశామని అన్నారు. రాష్ట్రంలోనే ప్రతి రైతుకు భరోసా భద్రత కల్పించాలని ఎన్నో రాత్రులు శ్రమించి, మేధావులతో చర్చించి, ఒక్క రోజు ఆలస్యం జరిగిన పేదలకు మంచి జరగాలనే తపనతో భూ భారతి చట్టాన్ని తయారు చేశామని తెలిపారు. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో రెవెన్యూ చట్టం తయారు చేయాలన్న ఆదర్శంగా ఉండే విధంగా భూ భారతి చట్టం ప్రజా ప్రభుత్వం తయారు చేసిందని, దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం నిలుస్తుందని అన్నారు

గత ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చి 3 సంవత్సరాలు గడిచిన రూల్స్ తీసుకుని రాలేదని, తమ ప్రభుత్వం భూ భారతి చట్టం రూల్స్ ప్రవేశపెట్టిందని, ఈ నిబంధనల ప్రకారం సాధా బైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని అన్నారు.పెండింగ్ ఉన్న సాధా బైనామా చట్టం సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం సాదా బైనమా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ధరణి చట్టంలో సాదా బైనమా గురించి అసలు పెట్టలేదని అన్నారు.

గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చారని, ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారమే జూన్ 2 నాటికి నియమిస్తామని, ప్రతి సంవత్సరం రెవెన్యూ రికార్డు మాన్యువల్ గా రాసి గ్రామంలో నోటీసు బోర్డుపై అతికిస్తామని మంత్రి తెలిపారు. భూ సరిహద్దులతో పాటు భూమి కొలతలు పూర్తిగా వండే విధంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకొని వచ్చామని అన్నారు. కర్ణాటక రాష్ట్రం విధానాలను ఆలోసరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో 6 వేల లైసెన్స్ ప్రైవేటు సర్వేయర్లను ఏర్పాటు చేస్తున్నామని , వీరికి మరో వారం రోజులలో శిక్షణ ప్రారంభం అవుతుందని అన్నారు.

తమ భూములు ధరణి వల్ల ఇంకా తమ పేరిట నమోదు కాలేదని అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ధరణి చట్టం వల్ల ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, కానీ భూ భారతి చట్టం వల్ల ప్రజల వద్దకే అధికారులు వారి వారి గ్రామాలకు వచ్చి ఒక్క రూపాయి తీసుకోకుండా భూ సమస్యలను పరిష్కరిస్తారని మంత్రి తెలిపారు. కోర్టులో లేని ప్రతి భూ సమస్య పరిష్కరించడమే భూ భారతి ముఖ్య ఉద్దేశం అన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ సమావేశం నిర్వహించి భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారని, మొదటగా ప్రతి జిల్లాలో ఒక మండలం పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నామని, జూన్ రెండు లోపు ఎంపిక చేసిన పైలెట్ మండలాలోని భూ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.

గతంలో ధరణి వ్యవస్థలో ఏదైనా సమస్య వస్తే కోర్టు వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా తహసిల్దార్ నుంచి సిసిఎల్ఏ వరకు 5 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు.సిసిఎల్ఏ స్థాయిలో న్యాయం జరగకపోతే ప్రజలు కొత్తగా ఏర్పడిన ట్రిబ్యునల్ సంప్రదించ వచ్చని, రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన ట్రిబ్యునల్ లను ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి మండలం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇదే పద్ధతిలో అధికారుల రైతులు వద్దకు వస్తారని, రైతుకు ఎటువంటి సమస్య లేకుండా పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని రాజకీయాల కతీతంగా అందరూ వినియోగించుకోవాలని అన్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి 10 లక్షల పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా, 20 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణ మాఫీ, సన్న వడ్లకు క్వింటాళ్ల 500 రూపాయల బోనస్, రైతు భరోసా, డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీల పెంపు, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం సరఫరా వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పేదల కోసం అమలు చేశామని అన్నారు.

అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని అన్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యా అందించేందుకు సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నామని అన్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తుందని అన్నారు. గిరిజనులకు ఉన్న పోడు భూములను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని 12 వేల 600 కోట్లతో చేపట్టిందని అన్నారు

రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి వర్యులు డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ,గతంలో సాగు నీరు కోసం రైతులు పడే ఇబ్బందులకు ప్రతి రోజూ ముందు ఉండి పోరాటం చేసిన నాయకులు నేడు ప్రజాప్రతినిధిగా ఉండటం సంతోషంగా ఉందని అన్నారు. ఎస్సారెస్పీ డీ 83,డీ86 కాల్వల క్రింద పూర్తి స్థాయి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంలో స్థానిక ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 57 వేల ఖాళీలను సంవత్సర కాలంలో ప్రజా ప్రభుత్వం భర్తి చేసిందని అన్నారు. గత 10 సంవత్సరాల కాలంగా గత ప్రభుత్వం అసలు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించ లేక పోయిందని అన్నారు. గతంలో ఎటువంటి సమస్యలు ఉన్న కోర్టు వెళ్లాల్సిన ఉండేదని, నేడు భూ సమస్యల పరిష్కారానికి తహసిల్దార్ నుంచి సిసిఎల్ఏ వరకు అంచెలంచెలుగా వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,

భూ సమస్యలు శాశ్వత పరిష్కారం చేసే దిశగా అంబేద్కర్ జయంతి నాడు ప్రభుత్వం భూ భారతి పోర్టల్ ప్రారంభించిందని, ఈ చట్టంపై సందేహాల నివృత్తి కోసం మండల కేంద్రాలలో అవగాహన సమావేశాలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. మన పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు మండలం పైలట్ గా ఎంపిక చేసి రెవెన్యూ సరస్సు నిర్వహిస్తున్నామని, తహసిల్దార్ అధికారి నేతృత్వంలో 2 బృందాలను ఏర్పాటు చేసి గ్రామాలలో ప్రజల దగ్గరి నుంచి భూ సమస్యలపై ఇప్పటి వరకు 11 గ్రామాలలో దాదాపు 1000 దరఖాస్తులు స్వీకరించి 132 దరఖాస్తులు పరిష్కరించామని అన్నారు.

మే 30 నాటికి క్షేత్రస్థాయిలో తనిఖీలు పూర్తిచేసి వచ్చిన ప్రతి భూ సమస్య దరఖాస్తు పరిష్కారం దిశగా పక్కా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ,గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, వాటి పరిష్కారమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొని వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story