- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రీ బస్సు పేరుతో హామీలన్నీ హాంఫట్ : ఎమ్మెల్యే కేటీఆర్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పేరుతో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మింగేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు విమర్శించారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పేరుతో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మింగేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందిగ్ధత సమావేశంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ముందుగా తెలంగాణ కవి, సాహితీవేత్త దివంగిత సి.నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలు మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శల దాడి గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, రాష్ట్రంలో అవినీతి, అరాచకాలకు తెరలేపిందని ఆరోపించారు. వ్యవసాయంతో పాటు ప్రతి రంగాన్ని మోసం చేసి, కేవలం మాటలతో రోజులు గడుపుతోందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు కోపంగా ఉన్నారని, మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని రైతులు ఆకాంక్షిస్తున్నారన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం బీసీలను సైతం మోసం చేసిందని, బీసీ రిజర్వేషన్ పేరిట జరుగుతున్న కుట్రను ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు జాతీయ అవార్డులు గెలుచుకున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సిరిసిల్లాలో బిఆర్ఎస్ ను ఓడించే నాయకుడే లేడని, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. భేషజాలకు పోకుండా ఐక్యంగా పనిచేసే మెజారిటీ స్థానాలు గెలిచి అధికారం సాధించాలన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన వారిని పార్టీ ఎప్పటికీ మరిచిపోదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవడానికి తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టేస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె శంకర్, సిరిసిల్ల, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్ పర్సన్లు న్యాలకొండ అరుణ, దావ వసంత, సెస్ చైర్మెన్ చిక్కాల రామారావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






