ఆర్మీలో కూడా 4 మీటర్ల లాంగ్ జంప్ లేదు... కానీ ఇక్కడెందుకు?

by Dishanational1 |
ఆర్మీలో కూడా 4 మీటర్ల లాంగ్ జంప్ లేదు... కానీ ఇక్కడెందుకు?
X

దిశ, కరీంనగర్ టౌన్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి, అభ్యర్థులను అయోమయానికి గురిచేసి, మానసికంగా వేధిస్తున్నారని ఏఐఎస్బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరియు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులకు నూతన నిబంధనల పేరుతో ఉద్యోగాలు దూరం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్ ని 3.8 మీటర్ల నుండి 4 మీటర్లకు పెంచారని, ఆర్మీలో కూడా 4 మీటర్ల లాంగ్ జంప్ లేదని ఆయన గుర్తు చేశారు. దీని వలన వేలాదిమంది విద్యార్థులు నష్టపోతున్నారని తక్షణమే లాంగ్ జంప్ ని 3.8 మీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా షాట్ ఫుట్ ని 5.6 మీటర్ల నుండి 6 మీటర్లకు పెంచారని.. దీనిని కూడా తక్షణమే తగ్గించాలని.. అలాగే డిజిటల్ విధానాన్ని తీసేసి పాత పద్ధతిలో మాన్యువల్ గా అభ్యర్థుల ఎత్తు కొలతలను తీసుకోవాలని అన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం ప్రిలిమ్స్ లో 7 మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అభ్యర్థులకు న్యాయం జరిగేంతవరకు ఏఐఎస్బీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రూ. కోట్లాది నిధులు వెచ్చించి బీసీ స్టడీ సర్కిల్ భవనాలు నిర్మిస్తే ఇప్పటికీ హాస్టళ్లను ప్రారంభించకపోవడం బాధాకరమని, తక్షణమే బీసీ సంక్షేమ శాఖ మంత్రి, అధికారులు స్పందించి హాస్టల్ భవనాన్ని ప్రారంభించాలని కోరారు. పూర్తిస్థాయి ఫ్యాకల్టీని నియమించి, నాణ్యమైన కోచింగ్ అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. పోలీస్ పరుగు పందెంలో మృతిచెందిన అభ్యర్థుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ బి రాష్ట్ర కార్యదర్శి మొలుగూరి హరికృష్ణ, రాష్ట్ర నాయకులు ముత్యాల హరీష్ రెడ్డి, నాయకులు కలికోట, అభిలాష్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed