రాకపోకలకు ఆటంకం కలిగేలా చేస్తే చర్యలు తీసుకుంటాం

by Ratna Kumari |

రాకపోకలకు ఆటంకం కలిగేలా రోడ్ల మీద ఇసుక కుప్పలు , కంకర కుప్పలు పోస్తే క‌ఠిన చ‌ర్య‌ల‌తో పాటు జరిమానా కూడా విధిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.

రాకపోకలకు ఆటంకం కలిగేలా చేస్తే చర్యలు తీసుకుంటాం
X

దిశ, గోదావరిఖని : రాకపోకలకు ఆటంకం కలిగేలా రోడ్ల మీద ఇసుక కుప్పలు , కంకర కుప్పలు పోస్తే క‌ఠిన చ‌ర్య‌ల‌తో పాటు జరిమానా కూడా విధిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ చిదురాల నాగరాజు తో కలసి సోమవారం 52 వ డివిజన్ కాకతీయ నగర్ లో పర్యటించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నిర్మాణం కొరకు తెప్పించిన కంకర, ఇసుక కుప్పలు రోజుల తరబడి రోడ్లపై చెల్లా చెదురుగా ఉండడంతో వాహనాలకు దారి లేకుండా ఇరుకుగా మారడంతో పాటు ప్రమాదాలకు గురువుతున్నట్లుగా తమ దృష్టికివచ్చిందని అన్నారు. తన పర్యటనలో భాగంగా ఒకరి ఇంటి ముందు రోడ్డు మీద ఇసుక కుప్పఉండడం గమనించి వెంటనే తొలగించుకోవాల్సిందిగా ఆ ఇంటి యజమానికి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే దుకాణ యజమానులు కూడా తమ సామాగ్రి రోడ్డుపై కాకుండా తమ ఆవరణ లోపల ఉంచుకోవాలని సూచించారు.


జేసీబీ, బ్లేడ్ ట్రాక్ట‌ర్, బాబ్ కార్ట్ , 15 మంది డ్రెయిన్ క్లీనర్ల సేవలను ఉపయోగించుకొని కాకతీయ నగర్ లో ఉన్న పెద్ద మురుగు నీటి కాలువ లో సుమారు కిలో మీటర్ పూడిక తొలగించడంతో పాటు కాలువ ప్రక్కన పెరిగిన పిచ్చి చెట్లు, చెట్ల కొమ్మలు తొలగించి శుభ్రం చేశారు. మేయర్ మహంకాళి స్వామి అధికారులకు , సిబ్బందికి సూచనలు ఇస్తూ పూడిక తొలగింపు పని పూర్తి చేయించారు. దుర్వాసన, పాముల బెడద తో గత కొన్ని ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న తాము కాలువ పూడిక తీత, పొదల తొలగింపు తో సమస్య తీరిపోయిందని పరిసరవాసులు హర్షం వ్యక్తం చేశారు. కాలువలో పూడిక చేరకుండా ఉండడానికి చెత్త వేయకుండా సహకరించాలని కాలనీ వాసులను మేయర్ అభ్యర్థించారు. శిథిలమైన కాలువ పునర్నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను ప్రక్కకు తరలించాలని ఆదేశించారు. రామగుండం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలనే ఎమ్మెల్యే నగర పాలక సంస్థ పాలక వర్గం చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఆయ‌న‌ వెంట పలువురు కార్పొరేటర్లతో పాటు నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, ఏఈ జమీల్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్ సంపత్ , జవాన్ దయాకర్ ఉన్నారు.

Next Story