పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే ధర్మపురి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక : మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్

by Nallavelli.Anjaneyulu |

ధర్మపురి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే ధర్మపురి చైర్మన్,  వైస్ చైర్మన్ ఎంపిక : మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్
X

దిశ, వెల్గటూర్ : ధర్మపురి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం సోమవారం నిర్వహించిన బలపరీక్ష కు మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధర్మపురి ప్రజలు తనపై విశ్వాసంతో 15 వార్డుల్లో 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించటం చాలా సంతోషంగా ఉందన్నారు. 2009 నుంచి గెలిచిన ఓడిన నియోజక వర్గంలోనే ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అయ్యానని తెలిపారు. మున్సిపాలిటీలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు విజయోత్సవాలు నిర్వహించుకోమని స్పష్టం చేశారు. ధర్మపురి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారని, ఇందులో సంఘనభట్ల సంతోషిదినేష్, వేముల నాగలక్ష్మి రాజేష్ లు పోటీ పడగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజ నిర్ణయంతో వేముల నాగలక్ష్మి నీ ధర్మపురి మున్సిపల్ చైర్మన్ గా ఇందారపు రామన్నను వైస్ చైర్మన్ గా ఎంపిక చేసినట్లు మంత్రి వివరించారు.

మొదటి రెండు సంవత్సరాలు ధర్మపురి మున్సిపల్ చైర్మన్ గా నాగలక్ష్మి తర్వాతి మూడు సంవత్సరాలు సంఘనభట్ల సంతోషిని చైర్మన్ గా కొనసాగుతారని మంత్రి వివరించారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం పోటీ పడిన సంఘనభట్ల సంతోషి దినేష్ కు త్వరలోనే రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి వారి గౌరవాన్ని కాపాడతానని మంత్రి హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం పోటీ పడిన ఇద్దరు తనకు కావాల్సిన‌ వారేనని మంత్రి అన్నారు. వారు కష్ట కాలంలో పార్టీకి, తనకు వ్యక్తి గతంగా చేసిన సేవలు మరువలేనివని మంత్రి అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా పట్టణంలో ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించమని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 60 రోజుల్లో నెరవేర్చిన అనంతరం విజయోత్సవాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కొత్తగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు వారి వార్డులో ఓటర్లను కలిసి కృతజ్ఞతలు తెలపాలని మంత్రి సూచించారు.

Next Story