జగిత్యాల మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు

by Ratna Kumari |   (  Updated:2026-04-07 15:50:05  IST  )

జగిత్యాల మున్సిపాలిటీలో అకస్మాత్తుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ విజ‌య్ కుమార్ ఆధ్వర్యంలో త‌నిఖీలు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

జగిత్యాల మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సర్‌ప్రైజ్ తనిఖీలు సంచలనంగా మారాయి. సుమారు 10 గంటల పాటు కొనసాగిన ఈ తనిఖీల్లో మున్సిపల్ పరిపాలనలో అనేక లోపాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఏసీబీ ఇన్ స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపిన వివరాల ప్రకారం… మున్సిపల్ రెవెన్యూ విభాగంలో పన్నుల వసూలు విషయంలో భారీ నిర్లక్ష్యం కనిపించినట్లు తెలిపారు. మున్సిపల్‌కు చెందిన ఒక ట్రాక్టర్, నాలుగు ఆటోలు ఐదు సంవత్సరాల క్రితమే మిస్ అవ్వగా వాటికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు కార్యాలయంలో లేవని స్పష్టం చేసారు. అడ్వర్టైజ్ బోర్డుల ఫీజులు ఈ ఏడాదికీ మొత్తానికే వసూలు చేయకపోవడం, అలాగే మున్సిపల్‌కు చెందిన అద్దె భవనాలకు గత 18 సంవత్సరాలుగా రీ-టెండర్ నిర్వహించకపోవడం గుర్తించినట్లు వివరించారు. పారిశుద్ధ్య వాహనాల డీజిల్, రిపేర్ బిల్లుల్లో కూడా అవకతవకలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.


టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ అనుమతులకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్‌లో ఉండటం కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జగిత్యాల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఫాగింగ్ బిల్లుల్లో తేడాలు ఉన్నాయని శానిటేషన్ మెటీరియల్ కొనుగోళ్లకు సంబంధించి GST బిల్లులు లేవని అన్నారు. సిబ్బంది వ్యక్తిగత ఫోన్‌పే, గూగుల్ పే లావాదేవీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ సర్‌ప్రైజ్ తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మున్సిపల్ లోని అన్ని సెక్షన్లకు సంబంధించి గుర్తించిన లోపాలపై విచారణ అనంతరం పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.

Next Story