గడి స్థలాల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని ఆర్డీవోకు వినతి

by Ratna Kumari |

పట్టణంలోని చారిత్రక గడి స్థలాల్లో నకిలీ దస్తావేజుల ఆధారంగా మంజూరైన అక్రమ వీఎల్టీలను వెంటనే రద్దు చేసి, ఆ భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

గడి స్థలాల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని ఆర్డీవోకు వినతి
X

దిశ, కోరుట్ల టౌన్ : పట్టణంలోని చారిత్రక గడి స్థలాల్లో నకిలీ దస్తావేజుల ఆధారంగా మంజూరైన అక్రమ వీఎల్టీలను వెంటనే రద్దు చేసి, ఆ భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో, గడి స్థలాల విచారణ అధికారి జీవాకర్ రెడ్డికి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు పూర్తి మద్దతుతో చేసిన సంతకాల ప్రతులను కూడా ఆర్డీవోకు అందజేశారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ కోరుట్ల గడి బురుజులు, కోనేరు, అనుబంధ స్థలాలు చాళుక్య- జైనుల కాలానికి చెందిన చారిత్రక వారసత్వ సంపద అని పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు నకిలీ దస్తావేజుల ఆధారంగా ఇంటి నెంబర్ 6-4-228ను చూపిస్తూ సుమారు 5,800 గజాల భూమిపై అక్రమంగా వీఎల్టీలు పొందారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్‌తో లోపాయికారీ ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఈ సమస్య పై ఇప్పటికే ప్రజలు, అఖిలపక్ష ప్రజాసంఘాలు పలు దశల్లో నిరసనలు, దీక్షలు, రాస్తారోకోలు నిర్వహించాయని గుర్తు చేశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కోరుట్ల మున్సిపల్ పరిధిలోని అన్ని పార్టీల కౌన్సిలర్లు, అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్, మాజీ ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు అక్రమ వీల్టీల రద్దుకు మద్దతుగా ఏకగ్రీవంగా సంతకాలు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు డాక్టర్ పేట భాస్కర్, ఎం.డీ. ముజాహిద్, చెన్న విశ్వనాథం, చింత భూమేశ్వర్, సుతారి రాములు, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్, శనిగారపు రాజేష్ పాల్గొన్నారు.

Next Story