అధికార అహంకారానికి నిండు ప్రాణం బలి..

by Kodari Anjali |

అధికార దాహానికి ఓ నిండుప్రాణం బలైంది.

అధికార అహంకారానికి నిండు ప్రాణం బలి..
X

దిశ, కరీంనగర్ బ్యూరో: అధికార దాహానికి ఓ నిండుప్రాణం బలైంది. అక్రమాలను ప్రశ్నించిన పాపానికి అధికార అహంకారంతో అమాయకుడిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధించడంతో ఆందోళనకు గురైన బాధితుడు న్యాయం కోసం నాయకుడి క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. పది రోజులుగా మృత్యువుతో పోరాడిన గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. రాజేందర్ రెడ్డిని చివరిసారి చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో గుండ్లపల్లి రణరంగంగా మారింది.

ఆందోళన ఉద్రిక్తం

స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు మురళీధర్ రెడ్డి వేధింపులతో ఆత్మాహుతికి పాల్పడి ప్రాణాలు కోల్పోయిన గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి మృతితో బంధువులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రాజేందర్ రెడ్డి మృతికి కారకుడైన మురళీధర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు ముందుగా కరీంనగర్ సివిల్ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు తాత్కాలికంగా నిరసన విరమించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. రాజేందర్ రెడ్డి మృతదేహం గ్రామానికి వస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు పెద్దఎత్తున గుండ్లపల్లికి చేరుకుని మృతదేహాన్ని మురళీధర్ రెడ్డి ఇంటి ముందు ఉంచి ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను అదుపు చేసే క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో గుండ్లపల్లి రణరంగంగా మారగా, రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.

రాజేందర్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు

రాజేందర్ రెడ్డి మృతితో గుండ్లపల్లి గ్రామం జనసంద్రంగా మారింది. చివరి చూపు చూసేందుకు వచ్చిన ప్రజలు కన్నీటి పర్యంతమవుతూ పాలకుల నిరంకుశత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని తుదివీడ్కోలు పలికారు.పది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన రాజేందర్ రెడ్డిని చూసేందుకు గ్రామస్తులను ఆస్పత్రికి వెళ్లనీయకుండా పోలీసులు కట్టడి చేయడంతో ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పార్టీలో చేర్చుకుని ప్రాణం తీశారు

మృతుడు రాజేందర్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికలకు ముందు తన గెలుపు కోసం పావులా ఉపయోగించుకుని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అక్రమాలపై ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టించి వేధించి ప్రాణాలు తీశారని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేందర్ రెడ్డి పాపం కొట్టిపోతారు అంటూ ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఏ మురళీధర్ రెడ్డిపై శాపనార్థాలు పెడుతూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంతాపం ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

రాజేందర్ రెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంతాపం ప్రకటించారు. తాను అమెరికాలో ఉండటంతో స్వయంగా అంతిమయాత్రలో పాల్గొనలేకపోయానని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన ఆయన, రాజేందర్ రెడ్డి మృతికి బాధ్యులైన మురళీధర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

మురళీధర్ రెడ్డితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు

గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి మృతికి సంబంధించి ఎమ్మెల్యే పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) మురళీధర్ రెడ్డితో పాటు మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మాహుతికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే బాధితుడిపైనే పలు కేసులు నమోదు చేసిన పోలీసులు, చివరకు రాజేందర్ రెడ్డి మృతికి సంబంధించి మురళీధర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేయడం మాత్రమే కాకుండా వెంటనే అరెస్టు చేయాలని బంధువులు భీష్మించడంతోచట్టపరమైన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు శాంతించి రాజేందర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.

Next Story