రూ.20ల‌క్ష‌ల విలువ గ‌ల ప్రాప‌ర్టీ కాజేసేందుకు ప్లాన్

by Ratna Kumari |

రూ. 20 లక్షల విలువైన ప్రాపర్టీని కాజేసేందుకు రవాణా శాఖ అధికారులమ‌ని నమ్మించి మోసం చేసిన నేర‌స్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రూ.20ల‌క్ష‌ల విలువ గ‌ల ప్రాప‌ర్టీ కాజేసేందుకు ప్లాన్
X

దిశ‌, తంగ‌ళ్ల‌ప‌ల్లి : రూ. 20 లక్షల విలువైన ప్రాపర్టీని కాజేసేందుకు రవాణా శాఖ అధికారులమ‌ని నమ్మించి మోసం చేసిన నేర‌స్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల రూర‌ల్ సీఐ మొగిలి వివ‌రాలను వెల్ల‌డించారు. గత జనవరి 10న జగిత్యాల జిల్లా రాజేంద్రనగర్ కాలనీకి చెందిన అబ్బనవేని చిన్న ఎల్లయ్య తల వెంట్రుకల వ్యాపారం చేస్తుంటాడు. అతడు సేకరించిన 8 క్వింటాళ్ల తల వెంట్రుకలను బొలెరో పికప్ బండిలో లోడ్ చేసుకొని జగిత్యాల నుంచి హైదరాబాదుకు వెళుతున్న క్రమంలో మార్గమధ్యలో పద్మనగర్ పెట్రోల్ బంకు సమీపంలో కొంతమంది వ్యక్తులు ఆర్టీవో లాగా నమ్మించి బండిని లోడ్ తో సహా తీసుకొని పారిపోయారు.

విలువ రూ. 20 లక్షల వ‌ర‌కు ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తంగళ్ళపల్లి ఎస్ఐ ఉపేంద్ర చారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నేరస్తులు ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఎస్ఐ ఉపేంద్ర చారి తన సిబ్బందితో ఒక బృందం ఏర్పాటు చేసుకొని ఖమ్మం జిల్లాకు వెళ్లి నేరస్తులైన బొజ్జ కృష్ణయ్య , అంగులూరి య‌ష్ పాల్, బ‌బ్లూ, ఎండ్ర‌తి ఉపేంద‌ర్, స‌న్ని డాల్ సింగ్ ల‌ను విచారించ‌గా నేరం ఒప్పుకున్నారు. వీరితో పాటు మ‌రో ఇద్ద‌రూ కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. విచార‌ణ అనంత‌రం నేర‌స్తుల‌ను సిరిసిల్ల కోర్టు రిమాండ్ కి పంపించ‌గా.. జ్యూడిషియ‌ల్ రిమాండ్ విధించి క‌రీంన‌గ‌ర్ జైలుకు త‌ర‌లించిన‌ట్టు సీఐ వెల్ల‌డించారు. వారికి చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నందుకు తంగళ్ళపల్లి ఎస్ఐ ఉపేంద్ర చారి, కానిస్టేబుల్స్ సంపత్, శ్రావణ్, శ్రీనివాస్ లను అభినందించారు.

Next Story