- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల గడుస్తున్నా జాడ లేని వానలు..
కరీంనగర్ జిల్లాలో వానాకాలం ప్రారంభమైనా కరువైన వానలు.. 35 శాతం లోటు వర్షపాతంతో అడుగంటిన భూగర్భ జలాలు.. రైతన్నల ఆవేదన!

వానాకాలం ప్రారంభమై నెల దాటినా కరీంనగర్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జూన్ మాసంలో జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రారంభంలో పడిన తుంపర్ల వానలకే రైతులు నార్లు పోసి, దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. బోర్ల నుంచి సరిపడా నీరు రాకపోవడంతో వరి నాట్లు వేయడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంగాధర, రామడుగు మినహా జిల్లాలోని మిగతా మండలాల్లో వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయి. వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వానలు కురిపించాలని అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు.
దిశ, కొత్తపల్లి : మృగశిర కార్తె ముగిసి, వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా జిల్లాలో వరుణుడి జాడ కానరావడం లేదు. ఆకాశంలో మబ్బులు కమ్మి నప్పుడల్లా అన్నదాతలు ఆశగా నింగి వైపు చూస్తున్నా.. మేఘాలు మురిపిస్తూ మొహం చాటేస్తున్నాయి. అప్పుడప్పుడు కురుస్తున్న తుంపర్ల వాన, దానికి తోడు తీవ్రమైన ఎండలు, వడగాల్పులు రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో పడిన కొద్దిపాటి చినుకులకు మురిసిపోయిన రైతులు.. వాన రాకపోతుందా అనే భరోసాతో దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. యాప్‌ల ద్వారా ఎంతో కష్టపడి యూరియా బుకింగ్స్ కూడా పూర్తి చేసుకుని, వ్యవసాయ బోరుబావుల ఆధారంగా వరినార్లు (తుకాలు) పోశారు. అయితే, ఆశించిన స్థాయిలో ముసురు వానలు కురవకపోవడంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు.
అడుగంటిన భూగర్భ జలాలు – లోటు వర్షపాతం
వర్షాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు ఊహించని విధంగా అడుగంటిపోయాయి. వానల్లేక బోర్లపైనే ఒత్తిడి పెరగడం, తోడుగా నాట్ల కోసం దున్న కాలు చేపట్టడంతో నీటిమట్టాలు మరింత లోతుకు పడిపోయాయి. దీంతో బోరుబావుల నుంచి నాట్లకు సరిపడా నీరు రావడం లేదు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జూన్ మాసంలో సాధారణ వర్షపాతం తో పోలిస్తే ఏకంగా 35 శాతం లోటు నమోదైంది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం.. గంగాధర, రామడుగు మండలాల్లో తప్ప జిల్లాలోని మిగతా అన్ని ప్రాంతాల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏప్రిల్, మే నెలల నుంచే పడిపోతున్న నీటి జాడలు.. ప్రస్తుతం జూన్ ముగుస్తున్నా పెరగకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజీ వీల్స్ ద్వారా అతికష్టం మీద దుక్కులు సిద్ధం చేస్తున్నా, వానదేవుడు కరుణించకపోతే పెట్టుబడులు నష్టపోతామని అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు.






