డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టి కృషి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

by Ratna Kumari |

యువత దేశానికి అతిపెద్ద సంపద అని, వారు చెడు అలవాట్లకు గురికాకుండా మంచి మార్గంలో నడుచుకుంటూ తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని పిలుపునిచ్చారు.

డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టి కృషి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
X

దిశ, జగిత్యాల టౌన్ : డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టి కృషి చేయాల‌ని ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, జగిత్యాల జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు హెల్త్, పోలీస్ శాఖలు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ- అడిక్షన్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ యువత దేశానికి అతిపెద్ద సంపద అని, వారు చెడు అలవాట్లకు గురికాకుండా మంచి మార్గంలో నడుచుకుంటూ తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు ప్రత్యేక వార్డుల్లో డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు, ఉచిత చికిత్స, మందులు అందిస్తున్నామని తెలిపారు.

ప్రతి పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ-డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని, ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో డ్రగ్స్ సమస్య పెద్ద సవాలుగా మారిందని, దీన్ని అరికట్టేందుకు ప్రత్యేకంగా ‘ఈగల్ టీమ్’ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బృందం ద్వారా నియంత్రణ, అవగాహన, పర్యవేక్షణ చర్యలు బలోపేతం అవుతున్నాయి. మత్తు పదార్థాల వాడకం ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక సమస్యలు నేరాలకు దారితీస్తుందని, ఇది సామాజిక-ప్రజా ఆరోగ్య సమస్య కాబట్టి అందరూ కలిసి పోరాడాలని సూచించారు. డీ అడిక్షన్ సెంటర్ అనేది వ్యసనానికి గురైన వారికి రెండో అవకాశం అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story