- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బడుగుల భూమిపై మాఫియా కన్ను.. నగరం నడిబొడ్డున 12 ఎకరాల భూమి కబ్జా
నీకు డబ్బుందా.. రాజకీయ బలం ఉందా.. నీకు పదిమంది ఉన్నతాధికారులు తెలుసా.. ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేయగలుగుతావా.. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి పోతావా.. అయితే ఓకే ఏమైనా చేసేయ్.. ఏ తప్పు చేసిన నీదే గెలుస్తుంది..

దిశ, గోదావరిఖని: నీకు డబ్బుందా.. రాజకీయ బలం ఉందా.. నీకు పదిమంది ఉన్నతాధికారులు తెలుసా.. ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేయగలుగుతావా.. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి పోతావా.. అయితే ఓకే ఏమైనా చేసేయ్.. ఏ తప్పు చేసిన నీదే గెలుస్తుంది.. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇది. న్యాయం అన్యాయం దేవుడెరుగు.. పేదోడా, ఉన్నోడా వారికి అవసరం లేదు. భూమిని కబ్జా చేశామా.. కోట్లు గడించామా అనేది వారికి అవసరం... ఇలాంటి వారికి ప్రభుత్వంలోని ఉన్నత అధికారుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటున్నాయి.
1983లో కాలనీ నిర్మాణానికి రిజిస్ట్రేషన్
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్న వెనుకబడిన తరగతుల వారు గృహ నిర్మాణ సహకార సంఘం ఏర్పాటు చేసుకొని 1983లో బ్యాక్వర్డ్ క్లాస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నంబర్ 568/టి క్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాలనీ నిర్మాణం కోసం 1983లో సర్వేనెంబర్ 285, 286 లో సుమారు 12 ఎకరాలను పట్టిదారు అయిన షఫీయుద్ధిన్ ద్వారా బ్యాక్ వార్డ్ సొసైటీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. డాక్యుమెంట్స్ నెంబర్ 1775/83, 1792/83, 1815/83, 1816/83, 1823/83, 1879/83, 2019 27/83, 2019 84/83 20015/83 డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసుకున్నారు. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్‌లో సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక్కొక్క సభ్యునికి 325 చదరపు గజాలను మళ్లీ బీసీ సొసైటీ రిజిస్ట్రేషన్ సభ్యులకు చేసింది. అంతర్గత రోడ్లు, పార్కు,గుడి కోసం స్థలాలను కూడా వదిలిపెట్టారు. నగర నడిబొడ్డున ఉన్న ఎంతో విలువైన స్థలంపై భూమాఫియా కన్ను పడింది. ఏముంది రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కుట్రలు చేశారు. వెనుకబడిన తరగతుల కోపరేటివ్ సొసైటీకి భూమి యజమాని షఫీయుద్దీన్ 1983 లో రిజిస్ట్రేషన్ చేస్తే 2014లో కొంతమంది దొంగ డాక్యుమెంట్లు సృష్టించి పట్టేదారు షఫీయుద్ధీన్ చనిపోగా అతని కొడుకు హితాయుద్ధీన్తో రిజిస్ట్రేషన్ చేసుకుని సుమారు రెండు ఎకరాల పైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండానే పెద్ద గోడ నిర్మించారు.
అనుమతి లేకుండా గోడ నిర్మాణం
రామగుండం మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయ పలుకుబడితో పెద్ద గోడ నిర్మించి ఎవరూ అటు వెళ్లకుండా గేటు నిర్మించారు. స్వంత ఫ్లాట్ యజమానులు అక్కడికి పోతే కొంతమంది గుండాలతో, ప్రైవేటు వ్యక్తులతో దాడులు చేస్తున్నారని తెలిపారు. ఈ ఫ్లాట్ల విషయంలో కలెక్టర్, రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశామన్నారు. రెవెన్యూ అధికారులు ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి పరిశీలించి ఇవి కొనుగోలు చేసిన ఫ్లాట్ యజమానులే అని ధృవీకరించిన పత్రాలను కూడా చూపెట్టారు. సొసైటీకి, ఫ్లాట్ యజమానులకు రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో మ్యుటేషన్లు కూడా ఉన్నాయని బాధితులు దిశ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు పూర్తి రిజిస్ట్రేషన్ పత్రాలనుచూపించారు. రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో 285, 286 సర్వే నెంబర్లు రెండు బ్యాక్ వర్డ్ సొసైటీ పేరు మీదనే ఆన్లైన్లో కనబడుతున్నాయి. మున్సిపల్ అధికారులను ఈ గోడకు పర్మిషన్ మీరు ఇచ్చారా, ఉందా.. అని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగుతే ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని, లేదని ధ్రువీకరించిన పత్రాన్ని ఇచ్చారు. కానీ భూ కబ్జాదారులు ఎంత పెద్ద మొత్తంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులకు ఇచ్చారో కానీ ఇప్పటికీ ఆ గోడ అలానే ఉంది. కొంతమంది ప్లాట్ ల యజమానులు గోడను కూలగొట్టాలని హైకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చిన అధికారులు మాత్రం స్పందిస్తలేరని ప్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన వారితో ఇయర్ రింగ్ అని పెట్టి నెలలకు నెలలు సాగదీస్తూ కాలయాపన చేస్తున్నారని ప్లాట్ కొనుగోలు చేసిన, హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ జీఎం ఖాన్ ఆరోపించారు. 04/02/2025 న హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్లో 45 రోజుల్లో ఆ గోడను మున్సిపల్ అధికారులే కూలదోయాలని స్పష్టంగా ఉంది. కానీ 8 నెలలుగా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. పోలీస్ కమిషనర్ అంబటి కిషోర్ జూ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ దీనిపై దృష్టి సారించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కొనుగోలు చేసిన ప్లాట్ యజమానులు వేడుకున్నారు.
కోర్టు ఆర్డర్ అందింది.
జె అరుణ శ్రీ అదనపు కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్
హైకోర్టు నుంచి గోడ కూల్చమని ఆర్డర్ వచ్చిన మాట నిజమే. గోడ నిర్మించిన వారిని, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జీఎం ఖాన్ తో ఇయర్ రింగ్ నిర్వహించాం. కాజిపల్లి లోని 285లో నిర్మించిన ప్రహరీ కి ఎలాంటి పర్మిషన్ రామగుండం మున్సిపల్ లో తీసుకోలేదు. ప్రహరీ నిర్మించిన వారు కోర్టులో స్టేటస్కో తీసుకున్నారు. తర్వాత ఏం చేయాలో అధికారులతో చర్చించుకుంటున్నాం. అక్రమంగా నిర్మించాలని తెలిస్తే తప్పకుండా కూల్చివేస్తాం.
గోడను అక్రమంగా నిర్మించారు.
జీఎం ఖాన్ (హైకోర్టును ఆశ్రయించిన ఫ్లాట్ కొనుగోలుదారుడు)
శేష జీవితం ఆనందంగా గడపాలని ప్లాట్ కొనుగోలు చేశాను. రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో మ్యూటేషన్ కూడా చేసుకున్నాను. 1983 నుంచి లింక్ డాక్యుమెంట్ కూడా స్పష్టంగా నా దగ్గర ఉన్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎల్ఆర్ఎస్ కూడా కట్టాను. కబ్జాదారులు తప్పుడు డాక్యుమెంట్‌తో మావి అని అంటున్నారు. కానీ ఎక్కడ వారి డాక్యుమెంట్లు చూపెట్టడం లేదు. కలెక్టర్, రామగుండం పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేశాను. స్థానిక ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసి ఉన్నాను. హైకోర్టు నుంచి భూ అక్రమ దారులు అక్రమంగా నిర్మించిన ఈ ప్రహరి గోడను కూలగొట్టాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆర్డర్ కాపీని పంపించాను.
న్యాయం చేయాలి
ప్రతాప్ రాజ్ ప్లాట్ యజమాని
అన్ని పత్రాలను పరిశీలించి నిజమైన కొనుగోలుదారులకు న్యాయం చేయాలి. ఇక్కడ మా నాన్న సుందర్ రాజ్ ప్లాట్ కొన్నారు. ఆయన బీసీ సొసైటీ ప్లాట్ల యజమానులకు న్యాయం జరగాలని ఎంతోమంది అధికారులను కలిసి సమస్యను వివరించారు. ఇప్పుడు నేను తిరుగుతున్నాను. మాకు అన్ని రకాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము కొన్న ఫ్లాట్ల మీదికి వెళితే కొంతమంది మహిళలను మా మీదికి ఉసిగొలుపుతున్నారు. మేము పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాము.






