- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఉత్తమ జిల్లాగా కరీంనగర్.. గవర్నర్ ప్రశంస
సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని, ఇది పారదర్శకతను ప్రోత్సహించి పౌరులను శక్తివంతులను చేస్తుందని గవర్నర్ విష్ణు దేవ్ వర్మ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని, ఇది పారదర్శకతను ప్రోత్సహించి పౌరులను శక్తివంతులను చేస్తుందని గవర్నర్ విష్ణు దేవ్ వర్మ తెలిపారు. సాధారణ పౌరుడు సైతం అధికారాన్ని ప్రశ్నించగల 'సాధికారుడిగా' మార్చినందుకు ఆర్టీఐ చట్టాన్ని ఆయన ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఇటీవలే 5 వేలకు పైగా పెండింగ్ కేసులను పరిష్కరించడం రాష్ట్రంలో సుపరిపాలనకు ఇది నిదర్శనమని అన్నారు. రవీంద్ర భారతిలో గురువారం జరిగిన సమాచార హక్కు వారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామస్థాయిలో కూడా పౌరులు అభివృద్ధి నిధులను వినియోగించే తీరును తెలుసుకునేందుకు ఆర్టీఐని ఉపయోగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత సమ్మిళితంగా చేస్తుందని వివరించారు.
పారదర్శకత, జవాబుదారీతనం సుపరిపాలనకు జంట స్తంభాలుగా పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలను ఉటంకించిన గవర్నర్.. ప్రతి అధికారి సమాచార సంరక్షకుడిగా మారాలని, ప్రతి పౌరుడు ఈ హక్కును బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జస్టిస్ సీపీ శ్యామ్ కోషి, సమాచార హక్కు చట్టం రాష్ట్ర చీఫ్ కమిషనర్ జి.చంద్రశేఖర్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్, జీఏడీ సెక్రటరీ ఎక్కా, ఆర్టీఐ కమిషనర్లు పీవీ శ్రీనివాస్, అయోధ్య రెడ్డి, భూపాల్, మోసినా పర్వీన్, వైష్ణవి, వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, సమాచార హక్కు చట్టం కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్టీఐ అమలులో ఉత్తమ జిల్లాగా కరీంనగర్...
సమాచార హక్కు చట్టాన్ని చక్కగా అమలు చేస్తున్న ఉత్తమ జిల్లాగా కరీంనగర్ మొదటి స్థానంలో నిలిచింది. మెదక్ జనగామ జిల్లాలు వరుసగా రెండు, మూడు స్థానాలు నిలిచాయి. అత్యుత్తమ శాకాధిపతిగా జలమండలి ఎండి అశోక్ రెడ్డి మొదటి స్థానంలో, సీడీఎం ఏ శ్రీదేవి రెండో స్థానంలో, ఎక్సైజ్ శాఖ కమిషనర్ రవికిషన్ మూడో స్థానంలో నిలిచి అవార్డులు తీసుకున్నారు. హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్, జీడి కార్యదర్శి ఎక్కా, బీసీ వెల్ఫేర్ కార్యదర్శి బాలమాయ దేవి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గోవర్ధన్ రెడ్డి తదితరులు ఆర్టీఐ అమలులో చక్కని పనితీరు కనబరిచి అవార్డులు పొందారు.






