‘కపాస్ కిసాన్’ కంపల్సరీ.. యాప్‌లో నమోదు చేస్తేనే పత్తి కొనుగోలు

by Ajay Maddhiboyina |

పత్తి రైతులు ఖచ్చితంగా ‘కపాస్ కిసాన్​యాప్’లో తమ పేర్లు నమోదు చేసుకుంటేనే వారు తీసుకొచ్చిన పంటను సీసీఐ తూకం వేయనుంది. గతంలో మాదిరిగా నేరుగా పత్తిని తీసుకొస్తే కొనుగోలు చేయకుండా వాపస్ పంపనుంది.

‘కపాస్ కిసాన్’ కంపల్సరీ.. యాప్‌లో నమోదు చేస్తేనే పత్తి కొనుగోలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పత్తి రైతులు ఖచ్చితంగా ‘కపాస్ కిసాన్​యాప్’లో తమ పేర్లు నమోదు చేసుకుంటేనే వారు తీసుకొచ్చిన పంటను సీసీఐ తూకం వేయనుంది. గతంలో మాదిరిగా నేరుగా పత్తిని తీసుకొస్తే కొనుగోలు చేయకుండా వాపస్ పంపనుంది. ఈసారి ప్రభుత్వం నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేసి దళారుల మోసాలకు బ్రేక్​వేసేందుకు నడుం బిగించింది. గతేడాది పంట పండించిన రైతుల కంటే మధ్య దళారులే ఎక్కువ పత్తిని అమ్మినట్లు ఫిర్యాదులు రావడంతో సీసీఐ నేరుగా రైతులే తమ పంటను విక్రయించుకునేలా చర్యలు చేపట్టింది. కపాస్ కిసాన్ యాప్‌లో పట్టాదారు పాసుబుక్ ఆప్‌లోడ్​చేయాలని, ఫోన్ నంబర్ కూడా ఆధార్‌కు లింక్​చేసుకుని ఓటీపీ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని రైతులకు సూచనలు చేస్తున్నది.

నేటి నుంచి కొనుగోళ్లు షురూ

నేటి నుంచి రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. ముందుగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ప్రారంభిస్తున్నది. తర్వాత దశల వారీగా వారం రోజుల్లో మిగతా జిల్లాలోనూ కొనుగోళ్లు చేపట్టనుంది. రైతు పండించిన కిలో పత్తి కూడా కొంటామని.. దళారుల వద్దకు వెళ్లవద్దని స్థానిక అధికారులు ప్రచారం చేపట్టారు. తేమ విషయంలోనూ నిబంధనలు పాటించక తప్పదని, తడిసిన పత్తి తీసుకొస్తే తాము తీసుకోబోమని సీసీఐ చెబుతోంది. కొందరు తూకం బాగా రావాలనే అత్యాశతో పత్తిపై నీళ్లు చల్లే అలవాటు మానుకోవాలని సూచిస్తోంది. పత్తి రైతులు దళారులను ఆశ్రయించ వద్దని, వారికి పంటను విక్రయించిన తర్వాత వారు నగదు ఇవ్వడం లేదని ఇబ్బందులకు గురికావద్దని సీసీఐ అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 24.70 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా. దానికి అనుగుణంగా ప్రభుత్వం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు యాప్​ద్వారా 21.07 లక్షల మంది రైతులు మాత్రమే నమోదు చేశారు. ఇంకా 19 లక్షల మంది నమోదు చేయలేదు. వీరికి వ్యవసాయ శాఖ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం పత్తి కొనుగోలుకు 317 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసింది. వాటి ద్వారా కొనుగోళ్లు వేగంగా చేపట్టనుంది.

స్లాట్ ప్రకారం పత్తి తరలించాలి

పత్తి రైతులు తమ వెసులుబాటును బట్టి పంటను అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. స్లాట్‌లో నమోదు చేసిన విధంగా ఏ రోజు గడువు ఇస్తే అదే రోజు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించాలి. ఆలస్యమైతే మరోసారి నమోదు చేయక తప్పదు. రైతుల మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసేందుకు వ్యవసాయ శాఖ ఏఈవో యాప్ లాగిన్‌లో ప్రత్యేక ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తమ పరిధిలోని అధికారిని సంప్రదించి మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకొని.. దీని ద్వారా మరుసటి రోజు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా రైతుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-5779ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా తమ సందేహాల నివృత్తితో పాటు ఫిర్యాదు చేయవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు పనిచేస్తుంది. ప్రతి ఉమ్మడి జిల్లాకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఏఈఓ, సెక్రెటరీ, సీసీఐ ప్రతినిధి, పోలీస్ అధికారి, రైతు ప్రతినిధితో కూడిన ఒక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాయి.

వెంచర్ల పట్టా పాస్‌బుక్‌లతో దళారుల దందా

‘కపాస్ కిసాన్’ యాప్ తీసుకురావడంతో పత్తి దళారుల అరాచకాలకు కళ్లెం పడింది. రైతులు నేరుగా అమ్మకాలు చేసుకునే వీలు ఉండటంతో వారికి పట్టాదారు పాసుబుక్‌లు ఇవ్వరు. ఈ క్రమంలో పత్తి దళారులు రియల్ ఎస్టేట్ వెంచర్ల యాజమానులను ఆశ్రయిస్తున్నారు. ఈసారి మీ పాస్‌బుక్‌ల ద్వారా పత్తి వ్యాపారం చేస్తామని, క్వింటాల్‌కు రూ.200 చొప్పన ఇస్తామని అంగీకారం చేస్తుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి సీసీఐ కొనుగోలు చేస్తున్నది. అంటే ఎకరం పట్టా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారికి రూ.2,400 కమీషన్ రానుంది. దీంతో వారు కూడా పాసు‌బుక్‌లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

Next Story