TG: ఆ టైంలో స్లాట్​దొరికిన రైతులు అదృష్టవంతులే..

by Gantepaka Srikanth |

TG: ఆ టైంలో స్లాట్​దొరికిన రైతులు అదృష్టవంతులే..

TG: ఆ టైంలో స్లాట్​దొరికిన రైతులు అదృష్టవంతులే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు పత్తి పంటను అమ్ముకోవడానికి కపాస్​కిసాన్ యాప్​కష్టాలు తప్పడం లేదు. యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే కనీసం వారం రోజుల సమయం పడుతోంది. రోజూ ఉదయం లేవగానే రైతులు ఫోన్ ద్వారా యాప్‌ను ఓపెన్​చేసి స్లాట్​కోసం పడరాని తిప్పలు పడుతున్నారు. ఉదయం 8.10 నుంచి 8.40 గంటల వరకే అందుబాటులో ఉంటున్నది. ఆ సమయంలో స్లాట్ దొరికితే అదృష్టంగా భావిస్తున్నారు. రోజుకు వేలాది మంది రైతులు ఎప్పుడు యాప్‌లో స్లాట్ దొరుకుతుందోనని పడిగాపులు పడుతున్నారు. సీసీఐ రోజుకు ఎంత సేకరణ పరిమితం పెట్టుకుంటుందో అంత ఆన్‌లైన్‌లో బుకింగ్ కాగానే వెంటనే యాప్​క్లోజ్​అవుతోంది. ఆ రోజు స్లాట్ దొరకని రైతులు మరుసటి రోజు ప్రయత్నం చేయడం, ఈ విధంగా వారం రోజుల పాటు శ్రమించాల్సి వస్తోంది. ఒకవేళ స్లాట్​దొరికినా 7 రోజుల వరకు ఆగాల్సిందే. తరువాత జిన్నింగ్ మిల్లుకు వెళ్తే అక్కడ ఒక రోజు పడిగాపులు తప్పవు. పత్తి పండించడం ఒక ఎత్తయితే.. పంటను అమ్ముకోవడం ఒక ఎత్తు అవుతోంది.

ఈ క్రమంలో కొందరు రైతులు ఎందుకు పత్తి పంట వేశామా? అని తలలు పట్టుకుంటున్నారు. రానున్న రోజుల్లో పత్తిని తగ్గించి ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేయడం ఉత్తమమనే భావనకు వస్తున్నారు. అదే దళారులు పత్తి అమ్మకం చేయాలంటే నాలుగైదు రోజుల్లోనే ప్రక్రియ పూర్తవుతోంది. వారు ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నచోట, ఖరీదైన సెల్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యాప్​అందుబాటులో ఉన్న సమయంలో ఒక సెకన్‌లో స్లాట్​బుకింగ్ చేసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ వాడటం రాని రైతులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. దళారీ వ్యవస్థను అరికడుతామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం వారిని యాప్ ద్వారా మరింత ప్రోత్సహిస్తున్నట్లు ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 330 జిన్నింగ్ మిల్లులు తెరవగా రోజుకు ఒక మిల్లులో 1,600 క్వింటాళ్ల వరకు కొనుగోలు జరుగుతోంది. ఈ సారి సీసీఐ 28.29 లక్షల మెట్రిక్​టన్నుల పత్తి కొనుగోలు లక్ష్యం చేరుకోవడం కష్టమేనని మార్కెటింగ్​శాఖ భావిస్తోంది.

ఎకరాకు 7 క్వింటాళ్లు మించితే దళారులే దిక్కు..

సీసీఐ నిబంధనల ప్రకారం జిన్నింగ్​మిల్లుల ద్వారా ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. 5 ఎకరాలు ఉన్న రైతు 35 క్వింటాళ్లు కేంద్రాల వద్ద విక్రయాలు చేయాలి. ఒకవేళ ఎకరాకు 7 క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వస్తే మిగతా పత్తి ఎక్కడ అమ్మకం చేయాలో తెలియక గత్యంతరం లేని పరిస్థితిలో దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వారు పత్తి నాణ్యత లేదని సాకులు పెడుతూ క్వింటా రూ.6,100కే కొనుగోలు చేస్తున్నారు. అదే పత్తి వారం రోజుల తరువాత దళారులు సమీపంలోని కొనుగోలు కేంద్రం వద్ద రూ.8,110కు దర్జాగా విక్రయాలు చేస్తున్నారు. కొందరు రైతులు ఎక్కువ పత్తి పండిస్తే స్థానికంగా ఉండే అగ్రికల్చర్ అధికారిని కలిసి తమకు ఎకరానికి 10 క్వింటాళ్లకుపైగా పత్తి పండినట్లు దరఖాస్తు పెట్టుకోవాలి. వారు వ్యవసాయ భూమి వద్దకు వచ్చి పంట వేసినట్లు ధ్రువీకరణ చేస్తే స్థానిక కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకం వేస్తారు. వ్యవసాయ శాఖ అధికారి పరిశీలన చేసిన తర్వాత ఆన్‌లైన్​వివరాలు పెట్టేవరకు వేచిచూడాలి.

యాప్‌ను గంటకు పైగా అందుబాటులో ఉంచాలి

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దళారులను అరికట్టాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కపాస్​కిసాన్​యాప్‌ను రోజుకు కనీసం గంట నుంచి రెండు గంటలు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. ఆర గంటే ఉంటే రైతులు ఏవిధంగా స్లాట్ బుక్​చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. సీసీఐ పెట్టిన సమయంలో దళారులకు మాత్రమే స్లాట్​దొరకుతోంది. నిజమైన రైతులకు దొరకడం లేదు. ప్రభుత్వం గంట నుంచి రెండు గంటల పాటు యాప్‌ను అందుబాటులో ఉంచితే రైతులు తమకు వీలున్న రోజు అమ్మకానికి తేదీ నిర్ణయించుకుంటారని రైతు సంఘాలు చెబుతున్నాయి.

Next Story